ప్రముఖ గాయకుడు, ‘బిగ్ బాస్ 14’ కంటెస్టెంట్ జాన్ కుమార్ సాను కోవిడ్-19 బారిన పడ్డారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి పడకపై నుంచే ఒక వీడియోను విడుదల చేస్తూ తనకు కరోనా సోకిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ప్రముఖ నేపథ్య గాయకుడు కుమార్ సను కుమారుడైన జాన్ కుమార్ సాను, ఈ బాధాకరమైన సమాచారాన్ని కూడా కొంత హాస్యంతో, వినూత్నంగా అభిమానులకు తెలియజేశారు. ఆదివారం ఆయన ఆసుపత్రి గదిలో నుంచి తీసిన వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

ఆ వీడియోకు ఆయన పెట్టిన క్యాప్షన్, రాసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

“చైనా నుంచి వచ్చిన నా స్నేహితుడా కోవిడ్‌కు సలాం చెయ్యి”

అనే క్యాప్షన్‌ను ఆ వీడియోకు జాన్ కుమార్ సాను జోడించారు.

అలాగే తాను ధరించిన ఆసుపత్రి దుస్తుల గురించి కూడా ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.

“ఫిట్ చెక్ – నాకు ఇష్టమైన డిజైనర్ కోకిలాబెన్ దుస్తులు ధరించాను. ఆసుపత్రిలో చేర్చింది మాత్రం వుహాన్ నుంచి వచ్చిన కోవిడ్”

అని రాసుకొచ్చారు.

జాన్ కుమార్ సాను ఈ పోస్ట్‌పై అభిమానులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అనేక కామెంట్లు పెడుతున్నారు. అయితే తనకు కోవిడ్ లక్షణాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎంతకాలం ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందనే వివరాలను ఆయన వెల్లడించలేదు.

ఒకవైపు బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతుండగా, మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా కొత్తగా కోవిడ్-19 కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో గత కొన్ని వారాలుగా ఎనిమిది యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. వీరిలో ఇద్దరు రోగులు చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం.

దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను రంగంలోకి దించింది. ఇప్పటివరకు సేకరించిన 40 నమూనాలలో 18 నెగటివ్‌గా తేలగా, మిగిలిన నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్ ఏదో తెలుసుకోవడానికి, దాని తీవ్రతను అంచనా వేయడానికి కొన్ని నమూనాలను పూణేలోని ల్యాబొరేటరీకి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందకుండా, అయితే నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని, కోవిడ్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.