దగ్గు సిరప్‌ల విక్రయానికి బ్రేక్‌..

ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి

పిల్లలకు సహా అందరికీ ఇచ్చే దగ్గు టానిక్‌లు, ఇతర ద్రవ ఔషధాల విక్రయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు సిరప్‌లు, ఇతర ఔషధ టానిక్‌లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించరాదు. ఫార్మసీల్లో ఓవర్ ది కౌంటర్‌గా ఈ సిరప్‌లను అమ్మితే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.

ఇటీవలి కాలంలో ఓవర్ ది కౌంటర్‌గా లభించే దగ్గు సిరప్‌ల వాడకంతో పలువురు చిన్నారులు మృతిచెందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో కల్తీ దగ్గు సిరప్‌ల కారణంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీశాయి. ఔషధాల నాణ్యత, భద్రతపై ప్రశ్నలు తలెత్తడంతో కేంద్రం చర్యలకు దిగింది.

జూన్ 9న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. డ్రగ్ రూల్స్‌లోని షెడ్యూల్ కె నుంచి ‘సిరప్‌లు’ అనే పదాన్ని తొలగిస్తూ ఈ మార్పులను అమల్లోకి తీసుకొచ్చింది. షెడ్యూల్ కెలో ఉండే ఔషధాలను సాధారణంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించవచ్చు. అయితే సిరప్‌లను ఆ జాబితా నుంచి తొలగించడం ద్వారా ఇకపై వాటిని తప్పనిసరిగా డాక్టర్ సూచనతోనే ఇవ్వాలనే నిబంధన అమల్లోకి వచ్చినట్లైంది.

దీంతో ఇప్పటివరకు ఫార్మసీల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొనుగోలు చేస్తున్న దగ్గు సిరప్‌లు, ఇతర ద్రవ రూపంలోని ఔషధాలను ఇకపై డాక్టర్ రాసిన చిట్టీతోనే పొందాల్సి ఉంటుంది. పిల్లలకు ఇచ్చే దగ్గు టానిక్‌లు, జ్వరానికి, విటమిన్‌ల కోసం వాడే అనేక ద్రవ ఔషధాలు ఈ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా ఔషధాల విక్రయ విధానంలో ఇది ఒక కీలక మార్పుగా భావిస్తున్నారు. ఇప్పటివరకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కోసం ప్రజలు నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి సిరప్‌లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. కొత్త నిబంధనలతో ఆ ప్రవర్తనలో మార్పు రావాల్సి ఉంటుంది. ఫార్మసీలు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా సిరప్‌లను ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఔషధాల నాణ్యత, భద్రతను మెరుగుపరచడం, కల్తీ మందుల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడం, చిన్నారుల ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి. కొత్త నిబంధనల అమలుతో ప్రజలు స్వయంగా మందులు కొనుగోలు చేసే విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.