మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా ఈ ఆరోపణలను ఖండించింది. అవన్నీ నిరాధారమని, తమ ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని కంపెనీ స్పష్టం చేసింది.

ఈ విషయంపై స్టాక్‌ ఎక్స్చేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో నెస్లే ఇండియా వివరాలు వెల్లడించింది. మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయంటూ సోషల్‌ మీడియా వేదికగా ఓ యూజర్‌ చేసిన ఆరోపణలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అఫ్ ఇండియా తమ దృష్టికి తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది.

ఆ యూజర్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి శాంపిల్స్‌ అందలేదని, అతనిని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ వివరాలు లభించలేదని నెస్లే ఇండియా ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో తమవంతు చర్యగా మార్కెట్‌ నుంచి మ్యాగీ నూడుల్స్‌ శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపినట్లు వివరించింది.

సోషల్‌ మీడియాలో వచ్చిన ఆరోపణలపై అధికారికంగా స్పందించిన నెస్లే ఇండియా, తమ ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ ప్రతి దశలోనూ కఠిన నాణ్యతా నియంత్రణ వ్యవస్థలు అమల్లో ఉన్నాయని స్పష్టం చేసింది. వినియోగదారుల విశ్వాసం తమకు అత్యంత ప్రాధాన్యమని, ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వబోమని కంపెనీ హామీ ఇచ్చింది.

మ్యాగీ నూడుల్స్‌పై గతంలోనూ వివిధ ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో పరీక్షలు నిర్వహించి, నియంత్రణ సంస్థలు నివేదికలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ఆరోపణలపై కూడా నెస్లే ఇండియా, NABL ల్యాబ్‌ పరీక్షల ఫలితాలను ఆధారంగా చూపిస్తూ తమ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై వినియోగదారులకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.