పెసరపప్పు vs కందిపప్పు:

రోజువారీ ఆహారానికి, జీర్ణక్రియకు ఏది మంచిది?

భారతీయ వంటగదిలో పప్పు లేని రోజును ఊహించుకోవడం చాలా కష్టం. మధ్యాహ్న భోజనం, రాత్రి సింపుల్ డిన్నర్ ఏదైనా ప్లేట్‌లో పప్పు తప్పనిసరిగా ఉంటుంది. అయితే మార్కెట్‌కు వెళ్లినప్పుడు లేదా ఇంట్లో వండేటప్పుడు చాలా మందికి ఒక సందేహం తలెత్తుతుంది – పెసరపప్పు మంచిదా? లేక కందిపప్పు మంచిదా? రోజూ ఏది తింటే ఆరోగ్యానికి మేలు? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రెండింటిలో ఏది ఉత్తమం అనేది కేవలం పోషకాలపైనే కాకుండా జీర్ణశక్తి, వంట శైలి, శరీర తత్వం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

పెసరపప్పు చాలా తేలికైన, పొట్టకు హాయినిచ్చే ఆహారంగా గుర్తింపు పొందింది. ఇది సులభంగా అరుగుతుంది. అందుకే అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా కడుపు అసౌకర్యంగా ఉన్నప్పుడు వైద్యులు పెసరపప్పు కిచేరి, పెసరకట్టు వంటి వంటకాలను సూచిస్తారు. పెసరపప్పు రుచి మైల్డ్‌గా, మృదువుగా ఉంటుంది. త్వరగా ఉడికే గుణం ఉండటంతో రాత్రి వేళల్లో తేలికపాటి భోజనం చేయాలనుకున్నప్పుడు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు పెసరపప్పు అనుకూలమైన ఎంపికగా భావిస్తున్నారు.

మన దేశంలో అత్యధిక ఇళ్లలో ప్రతిరోజూ వాడేది మాత్రం కందిపప్పే. కందిపప్పుకు కమ్మటి, బలమైన రుచి ఉంటుంది. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. మధ్యాహ్న భోజనానికి ఇది పర్ఫెక్ట్ జోడీగా అనేక కుటుంబాల్లో స్థానం సంపాదించింది. అయితే కొందరిలో కందిపప్పు తిన్నప్పుడు కాస్త బరువుగా అనిపించడం, గ్యాస్ సమస్యలు రావడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో పప్పును వండటానికి ముందు కొంతసేపు నానబెట్టడం, వండేటప్పుడు ఇంగువ, వెల్లుల్లి చేర్చడం ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

పోషకాల పరంగా చూస్తే పెసరపప్పు, కందిపప్పు రెండింటి మధ్య పెద్ద తేడా లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. రెండు పప్పులూ పల్సెస్ జాబితాలోకి వస్తాయి. విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం, నాణ్యమైన ప్లాంట్ ప్రోటీన్ రెండింటిలోనూ పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల ఒకదానిని మరొకదానికంటే గొప్పదిగా ఖచ్చితంగా చెప్పడం కష్టం. పరిశోధనల ప్రకారం రెండు పప్పులు శరీరానికి వేర్వేరు విధాలుగా మేలు చేస్తాయి. రోజువారీ భోజన అవసరాన్ని బట్టి ఏ పప్పును ఎంచుకోవాలనేది మారుతుంది.

న్యూట్రిషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం డైట్‌లో ఒకే రకమైన పప్పుపైనే ఆధారపడటం కన్నా పెసరపప్పు, కందిపప్పు రెండింటినీ మార్చిమార్చి వాడటం ఆరోగ్యానికి మరింత మంచిది. తేలికపాటి భోజనం, సులభమైన జీర్ణక్రియ కావాలనుకున్నప్పుడు పెసరపప్పును, కమ్మటి రుచి, కడుపు నిండే భోజనం కావాలనుకున్నప్పుడు కందిపప్పును ఎంచుకోవడం ఉత్తమ పద్ధతి. వారంలో రెండు పప్పులను మారుస్తూ వాడుకుంటే రుచితో పాటు సంపూర్ణ పోషకాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

మార్కెట్లో పప్పులు కొనేటప్పుడు నాణ్యత, తాజాదనం కూడా అంతే ముఖ్యం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎక్కడ కొనుగోలు చేసినా ప్యాకెట్ వెనుక ఉన్న వివరాలను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. పెసరపప్పులో పొట్టు పప్పు, ముడి పప్పు, పసుపు పప్పు వంటి రకాలు ఉంటాయి. అలాగే కందిపప్పులోనూ వేర్వేరు రకాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి వండే విధానాన్ని బట్టి జీర్ణమయ్యే తీరు మారుతుంది. అందువల్ల బ్రాండ్స్ కంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వడం, శరీర తత్వానికి అనుగుణంగా పప్పులను ఎంచుకోవడం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటుగా నిపుణులు సూచిస్తున్నారు.