రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు మార్క్ రైడెల్ (97) మృతిచెందారు. లాస్ ఏంజిలెస్‌లోని వుడ్‌ల్యాండ్ హిల్స్‌లో వినోద పరిశ్రమ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఓ విశ్రాంతి గృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యంతో సంబంధం ఉన్న కారణాల వల్ల తన తండ్రి మరణించినట్లు రైడెల్ కుమార్తె అమీ రైడెల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆయన మరణవార్త తెలిసిన హాలీవుడ్ సినీ ప్రముఖులు రైడెల్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
1955లో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టి రైడెల్ తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో బ్యాజ్ పియానిస్ట్‌గా కూడా పనిచేశారు. టీవీతో పాటు సినిమాల్లోనూ తన ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగారు. ‘ది లాంగ్ గుడ్ బై’, ‘పంచ్ లైన్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కెరీర్ తొలి దశలోనే స్టీగర్, మినెయో వంటి ప్రముఖ నటులతో కలిసి నటించే అవకాశం రైడెల్‌కు లభించింది. ఆ పాత్రల ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది. అనంతరం నటన కంటే దర్శకత్వంపై ఎక్కువ దృష్టి సారించారు.
‘ది ఫాక్స్’ సినిమాతో రైడెల్ తొలిసారి దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత ‘సిండ్రెల్లా లిబర్టీ’, ‘ది రోజ్’, ‘ఇంటర్‌సెక్షన్’, ‘ఈవెన్ మనీ’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. విభిన్న శైలిలో కథలను ఎంపిక చేసుకుంటూ, నటుల సామర్థ్యాన్ని వెలికితీసే విధంగా చిత్రాలను రూపొందించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.
1981లో విడుదలైన ‘ఆన్ గోల్డెన్ పాండ్’ చిత్రం రైడెల్ కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమా ఆస్కార్ అవార్డుల కోసం పది విభాగాల్లో నామినేషన్లు సాధించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రైడెల్‌కు కూడా ఆస్కార్ నామినేషన్ లభించినప్పటికీ, అవార్డు మాత్రం అందుకోలేకపోయారు.
నటుల నుండి అత్యుత్తమ నటనను రాబట్టడంలో రైడెల్‌కి ప్రత్యేకమైన పేరు ఉంది. పాత్రలో పూర్తిగా మునిగిపోయేలా వారిని ప్రోత్సహించడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం కారణంగా హాలీవుడ్‌లో ఆయనను ‘యాక్టర్స్ విస్పరర్’ అని పిలిచేవారు. ఆయన దర్శకత్వంలో నటించిన హెన్రీ ఫోండా, కాథరిన్ హెప్‌బర్న్ వంటి దిగ్గజ నటులు ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడం సినీ వర్గాల్లో విశేషంగా ప్రస్తావించబడుతోంది.
దాదాపు ఏడు దశాబ్దాలపాటు సాగిన తన సినీ ప్రయాణంలో రైడెల్ టెలివిజన్, సినిమా రంగాల్లో అనేక గుర్తుండిపోయే కృతులను అందించారు. ఆయన మరణంతో హాలీవుడ్ మరో ప్రతిభావంతుడైన దర్శకుడిని కోల్పోయిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.






