రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ఇంటర్నెట్ డెస్క్: తెరపై కనిపించే హీరో కాదు క్రిస్టఫర్ నోలన్. కానీ హాలీవుడ్ సూపర్‌స్టార్లకు ఉన్నంత క్రేజ్ ఆయనకూ ఉంది. సైంటిస్ట్ కాకపోయినా వైవిధ్యమైన స్టోరీ టెల్లింగ్ టెక్నిక్కులను ఆవిష్కరించే ప్రయోగశీలి. ఫిజిక్స్ ప్రొఫెసర్ కాకపోయినా థియేటర్లో ఉన్నామా, ఫిజిక్స్ క్లాస్‌లో ఉన్నామా అన్న అనుభూతిని ప్రేక్షకులకు కలిగించే అసాధారణ క్రియేటర్. కథలతో ప్రయోగాలు చేస్తూనే కమర్షియల్‌గా సూపర్ హిట్ సినిమాలు తీయడం నోలన్ ప్రత్యేకత. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన 12 చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ఇదే ఆయన ట్రాక్ రికార్డ్.
తాజాగా నోలన్ నుంచి రాబోతున్న ‘ది ఒడిస్సీ’పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. జూలై 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నోలన్ సినిమాలు సాధించిన వసూళ్లపై ఓ దృష్టి.
‘ఫాలోయింగ్’ (1998) నోలన్ తొలి చిత్రం. బడ్జెట్ 6 వేల డాలర్లు. వసూళ్లు 1.26 లక్షల డాలర్లు. సినిమా దర్శకుడు కావాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి తక్కువ వనరులతో 70 నిమిషాల నిడివితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక సిబ్బంది అంతా ఆయన స్నేహితులే. వారాంతాల్లో మాత్రమే షూటింగ్ చేశారు. నలుపు తెలుపు రంగుల్లో నియోనాయిర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా బడ్జెట్‌తో పోలిస్తే 21 రెట్లు అధిక వసూళ్లు సాధించింది.
రెండో చిత్రం ‘మెమెంటో’ (2000)తోనే నోలన్ సరికొత్త స్టోరీ టెల్లింగ్ టెక్నిక్‌తో ప్రత్యేకత చాటుకున్నారు. బడ్జెట్ 9 మిలియన్ డాలర్లు, వసూళ్లు 43.26 మిలియన్ డాలర్లు. షార్ట్‌టర్మ్ మెమరీ లాస్‌కు గురైన వ్యక్తి తన భార్యను చంపినవారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే అంశాన్ని రివర్స్ క్రానాలజీ విధానంలో చెప్పిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
‘ఇన్‌సోమ్నియా’ (2002) నార్వేలో 1997లో వచ్చిన అదే పేరుతో ఉన్న చిత్రానికి హాలీవుడ్ రీమేక్. బడ్జెట్ 46 మిలియన్ డాలర్లు, వసూళ్లు 113.76 మిలియన్ డాలర్లు. నోలన్ చిత్రాల్లో తాను కథారచనలో పాలుపంచుకోని ఏకైక సినిమా ఇదే. బడ్జెట్‌ను మించి వసూళ్లు సాధించి విజయవంతమైన చిత్రంగా నిలిచింది.
‘బ్యాట్‌మ్యాన్ బిగిన్స్’ (2005)తో నోలన్ సృష్టించిన ‘డార్క్‌నైట్’ ట్రైలజీకి శ్రీకారం చుట్టారు. బడ్జెట్ 150 మిలియన్ డాలర్లు, వసూళ్లు 375.59 మిలియన్ డాలర్లు. 1997లో వచ్చిన ‘బ్యాట్‌మ్యాన్ & రాబిన్’ తరువాత మసకబారిన ‘బ్యాట్‌మ్యాన్’ పాత్రకు మళ్లీ ప్రాణం పోశారు.
తదుపరి చిత్రం ‘ది ప్రెస్టీజ్’ (2006)ను నోలన్ 40 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. వసూళ్లు 109.68 మిలియన్ డాలర్లు. వృత్తిపరమైన ఆధిపత్యం కోసం పరితపించే ఇద్దరు మెజీషియన్ల జీవితాల్లో వారు కోల్పోయిన అంశాలను ఆవిష్కరిస్తూ కట్టిపడేసే కథనంతో ఈ సినిమా రూపొందింది.
‘ది డార్క్ నైట్’ (2008) ‘డార్క్‌నైట్’ ట్రైలజీలో రెండో చిత్రం. బడ్జెట్ 185 మిలియన్ డాలర్లు, వసూళ్లు 1.008 బిలియన్ డాలర్లు. నోలన్ కెరీర్‌లో బిలియన్ డాలర్ల మార్క్ దాటిన తొలి సినిమా ఇదే. బడ్జెట్ కన్నా ఐదు రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించింది.
క్లిష్టమైన కథాంశాలతో ప్రేక్షకుల మెదడుకు పరీక్ష పెట్టడం నోలన్ శైలి. ‘ఇన్సెప్షన్’ (2010) ఆ శైలికి బీజం వేసిన చిత్రం. బడ్జెట్ 160 మిలియన్ డాలర్లు, వసూళ్లు 864.54 మిలియన్ డాలర్లు. ఇతరుల కలల్లోకి చొరబడి వారి రహస్యాలను దొంగలించే వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది. ఓ వ్యక్తి సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ప్రవేశించి ఒక ఆలోచనకు బీజం వేసే ప్రయత్నం చేస్తే ఏమవుతుందన్నది కథాంశం. నోలన్ సినిమాలకు ప్రత్యేక అభిమాన వర్గం ఏర్పడటం ‘ఇన్సెప్షన్’ నుంచే మొదలైంది.
‘ది డార్క్ నైట్ రైజెస్’ (2012) ట్రైలజీలో చివరి చిత్రం. బడ్జెట్ 250 మిలియన్ డాలర్లు, వసూళ్లు 1.085 బిలియన్ డాలర్లు. నోలన్ కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన సూపర్ హీరో ఫ్రాంఛైజీల్లో ‘డార్క్‌నైట్’ ట్రైలజీకి ప్రత్యేక స్థానం లభించింది.
‘ఇంటర్‌స్టెల్లార్’ (2014) బడ్జెట్ 165 మిలియన్ డాలర్లు, వసూళ్లు 790.65 మిలియన్ డాలర్లు. ఫిజిక్స్ కాన్సెప్టులను భావోద్వేగభరిత కుటుంబ కథతో మిళితం చేసి ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ‘డంకిర్క్’ (2017) బడ్జెట్ 100 మిలియన్ డాలర్లు, వసూళ్లు 549.98 మిలియన్ డాలర్లు. డంకిర్క్ తీరంలో చిక్కుకుపోయిన లక్ష మందికిపైగా సైనికులను భూమార్గం, జలమార్గం, వాయుమార్గం ద్వారా తరలించే రెస్క్యూ మిషన్ కథ ఇది. బడ్జెట్‌తో పోలిస్తే అయిదున్నర రెట్లు వసూళ్లు సాధించింది.
కోవిడ్ మహమ్మారి భయాల మధ్య విడుదలైన ‘టెనెట్’ (2020) బడ్జెట్ 205 మిలియన్ డాలర్లు, వసూళ్లు 365.31 మిలియన్ డాలర్లు. థియేటర్లకు రావడానికి వెనుకంజ వేసిన ప్రేక్షకులను నోలన్ బ్రాండ్ మళ్లీ హాళ్లకు రప్పించింది. బడ్జెట్ కన్నా ఎక్కువ వసూళ్లు అందుకుంది.
అణుబాంబు పితామహుడిగా పిలుచుకునే న్యూక్లియర్ సైంటిస్ట్ J. Robert Oppenheimer జీవితం ఆధారంగా నోలన్ రూపొందించిన ‘Oppenheimer’ (2023) బడ్జెట్ 100 మిలియన్ డాలర్లు, వసూళ్లు 975.81 మిలియన్ డాలర్లు. సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన బయోపిక్‌గా నిలిచిన ఈ చిత్రం బడ్జెట్‌తో పోలిస్తే 9 రెట్లు ఎక్కువ వసూలు చేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది.
నోలన్ తాజా చిత్రం ‘The Odyssey’ 250 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుంది అని భావిస్తున్నారు సినీ వర్గులు.






