యూకే కొత్త ప్రధానిగా ఆండీ బర్న్‌హమ్‌..

సోమవారం బాధ్యతల స్వీకరణ

యునైటెడ్ కింగ్‌డమ్‌ కొత్త ప్రధానిగా ఆండీ బర్న్‌హమ్‌ బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. అధికార లేబర్ పార్టీకి కొత్త నాయకుడిగా ఆయన ఎన్నికయ్యారు. దీంతో సోమవారం ఆయన అధికారికంగా బ్రిటన్‌ 59వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

లండన్‌లో నిర్వహించిన లేబర్ పార్టీ ప్రత్యేక సమావేశంలో పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (NEC) ఛైర్‌పర్సన్ షబానా మహ్మూద్ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ నాయకత్వానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ఒక్కరే ఉండటంతో ఎలాంటి పోటీ లేకుండానే బర్న్‌హమ్‌ ఎన్నిక స్థిరమైంది.

నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ఒక్కరే ఉన్నారు. అందువల్ల ఈ ఎన్నికలో ఎలాంటి ఉత్కంఠ నెలకొనలేదు.

సోమవారం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఆండీ బర్న్‌హమ్‌ రాజు చార్ల్స్-IIIను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానం స్వీకరించనున్నారు. అంతకుముందు ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ తన రాజీనామాను అధికారికంగా రాజుకు సమర్పించనున్నారు. ఆ తర్వాత 10 డౌనింగ్ స్ట్రీట్ లో బర్న్‌హమ్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దాదాపు పదేళ్ల క్రితం లేబర్ పార్టీలో రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని పక్కనబెట్టి లండన్‌ను విడిచిన ఆండీ బర్న్‌హమ్‌.. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ పార్లమెంట్‌కు ఎన్నికైన ఆయన ఇప్పుడు అనూహ్యంగా దేశ ప్రధానమంత్రి పదవిని అధిరోహించబోతున్నారు.

కేవలం రెండేళ్ల పాలన తర్వాత ప్రధాని కీర్ స్టార్మర్ పదవి వీడాల్సి రావడంతో 56 ఏళ్ల ఆండీ బర్న్‌హమ్‌కు ప్రధానమంత్రి అయ్యే అవకాశం లభించింది. ప్రజల చేత నేరుగా ఎన్నిక కాకుండానే ఈ పదవికి చేరుకుంటున్న ఆయన ముందున్న సవాళ్లు చిన్నవి కావని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మాంచెస్టర్‌కు చెందిన ‘ ది మిల్ ’ వార్తా సంస్థ వ్యవస్థాపకుడు జోషి హెర్మన్‌ అభిప్రాయపడుతూ, లేబర్ పార్టీ కార్యకర్తలు, దేశ ప్రజలు ఆండీ బర్న్‌హమ్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారని, ఇప్పుడు ఆ ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పేర్కొన్నారు.

లివర్‌పూల్‌లో జన్మించిన ఆండీ బర్న్‌హమ్‌ తండ్రి బ్రిటిష్ టెలికాం ఇంజనీర్‌గా, తల్లి రిసెప్షనిస్ట్‌గా పనిచేశారు. క్యాథలిక్ కుటుంబంలో పెరిగిన ఆయన ప్రస్తుతం తాను పెద్దగా మతపరమైన వ్యక్తి కాదని చెప్పుకున్నప్పటికీ, సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువలను క్యాథలిక్ బోధనలు, లేబర్ పార్టీ సిద్ధాంతాల నుంచే నేర్చుకున్నానని గతంలో వెల్లడించారు.

బర్న్‌హమ్‌ కుటుంబంలో విశ్వవిద్యాలయంలో చదివిన తొలి తరం వ్యక్తుల్లో ఒకరైన ఆయన, బ్రిటన్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో ఒకటైన కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం లేబర్ పార్టీ నాయకత్వం చేపట్టిన ఆయన సోమవారం నుంచి బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆండీ బర్న్‌హమ్‌కు భారత్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పలుమార్లు భారత్‌లో పర్యటించిన ఆయనకు ప్రత్యేకంగా ప్రధాని మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యూకే–భారత్‌ల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.