బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తన పదవీకాలం ముగియడానికి దాదాపు రెండేళ్లు మిగిలి ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవడం బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికారికంగా మాత్రం ఆయన ఆరోగ్య సమస్యల కారణంగానే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

స్థానిక మీడియా సమాచారం ప్రకారం, షహాబుద్దీన్ రాజీనామా లేఖను బంగాభవన్ నుంచి జాతీయ పార్లమెంట్‌కు పంపించారు. ఆయన రాజీనామా ప్రకటనతో పాటు, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఫోన్ సంభాషణ కూడా బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ ప్రధాని షేక్ హసీనాతో జరిగినట్లు ప్రచారంలో ఉన్న ఆ సంభాషణే అసలు కారణమా అనే ప్రశ్నలు లేవుతున్నాయి.

“నేను పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. అందుకే రాజీనామా చేశాను. ప్రస్తుతం దీనిపై అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు”

ఈ ఏడాది మే నెలలో వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లిన సమయంలో షహాబుద్దీన్, భారత్‌లో నివసిస్తున్న మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు స్థానిక మీడియా వార్తలు వెలువరించింది. మే 9న లండన్‌కు వెళ్లిన ఆయన, మే 18న తిరిగి బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు.

2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమాల నేపథ్యంలో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోవడంతో షేక్ హసీనా భారత్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఆమెతో అధ్యక్షుడు మళ్లీ సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నం చేశారనే సమాచారం ప్రభుత్వం, నిఘా సంస్థలకు చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే షహాబుద్దీన్‌పై ఒత్తిడి రావడానికి కేవలం ఫోన్ సంభాషణ మాత్రమే కారణం కాదని, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, షేక్ హసీనా తిరిగి దేశానికి వస్తానని ప్రకటించడం కూడా కీలక అంశాలుగా మారాయని బీఎన్‌పీ నాయకులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

అధ్యక్షుడి రాజీనామాతో బంగ్లాదేశ్ రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకు జాతీయ పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ తాత్కాలికంగా అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 ప్రకారం, అధ్యక్ష పదవి ఖాళీ అయినప్పుడు లేదా అధ్యక్షుడు విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడితే స్పీకర్ తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపడతారు.

అలాగే ఆర్టికల్ 123(2) ప్రకారం, అధ్యక్షుడి రాజీనామా, మరణం లేదా పదవి నుంచి తొలగింపు జరిగిన 90 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ప్రస్తుతం పార్లమెంట్‌లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)కి మెజారిటీ ఉండటంతో, కొత్త అధ్యక్షుడి ఎంపికలో ఆ పార్టీ కీలక పాత్ర పోషించనుంది.

మొహమ్మద్ షహాబుద్దీన్ 2023 ఏప్రిల్ 24న బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అవామీ లీగ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు ప్రత్యర్థులు లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే ముందు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేసిన షహాబుద్దీన్ 2006లో న్యాయవ్యవస్థ నుంచి పదవీ విరమణ చేశారు. అనంతరం 2011 నుంచి 2016 వరకు అవినీతి నిరోధక కమిషన్ కమిషనర్‌గా సేవలందించారు. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాల్గొన్న ఆయన అవామీ లీగ్‌లో కూడా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.

2024లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత నుంచి షహాబుద్దీన్ పదవిపై వివాదాలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ సంస్థలు ఆయనను తొలగించాలని డిమాండ్ చేశాయి. అయితే రాజ్యాంగ పరిమితులను దృష్టిలో ఉంచుకుని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించలేదు. 2026 పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అధ్యక్షుడి మార్పుపై మళ్లీ చర్చ మొదలైంది. చివరకు పదవీకాలం ముగియకముందే షహాబుద్దీన్ రాజీనామా చేయడంతో బంగ్లాదేశ్‌లో కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వేగం పట్టింది.