ఆఫ్రికా ఖండంలోని సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో బంగారు గని కుప్పకూలిన ఘటనలో కనీసం 30 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నానా మంబెరే ప్రాంతంలో ఉన్న ఈ గనిలో వందలాది మంది కార్మికులు మైనింగ్ పనుల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదం జరిగింది.

స్థానిక సమాచారం ప్రకారం, కార్మికులు గనిలో లోతుగా తవ్వకాలు చేస్తుండగా ఒక్కసారిగా మట్టి గోడలు కూలి భారీగా జారిపడ్డాయి. మట్టి, రాళ్లు పెద్ద ఎత్తున కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులను పూర్తిగా కమ్మేశాయి. ఈ ప్రమాదంలో 30 మంది కార్మికులు మట్టి కింద చిక్కుకుని మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి అధికారులు, స్థానిక భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మట్టిని తొలగిస్తూ చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గనిలో పనిచేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

గనిలో భద్రతా ప్రమాణాలు, తవ్వకాల విధానం, మట్టి గోడల స్థితి వంటి అంశాలపై అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, బాధ్యతలపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు స్థానికంగా బయటకు వచ్చాయి. మట్టి, రాళ్లు ఒక్కసారిగా కూలిపోవడం, కార్మికులు పరుగులు తీస్తూ కనిపించడం వంటి దృశ్యాలు ఆ వీడియోల్లో నమోదయ్యాయి. ఈ దృశ్యాలు చూసిన వారిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లోని అనేక ప్రాంతాల్లో బంగారం తవ్వకాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇలాంటి గనుల్లో భద్రతా ఏర్పాట్లు, కార్మికుల రక్షణ చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం మరింత చర్చనీయాంశంగా మారింది.