రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దాస్‌పారా (మచువాపారా) ప్రాంతంలో ఉన్న వారి స్వగృహంలోనే రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు మృతదేహాలు లభించాయి. ఈ ఘటన హిందూ సమాజంలోనూ, మొత్తం నగరంలోనూ భయాందోళనలు సృష్టిస్తోంది.
మృతులను రంగ్‌పూర్ జిల్లా పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి (50), కుమార్తె ఆగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియం చక్రవర్తి (12)గా గుర్తించారు. ఒకే హిందూ ఫ్యామిలీకి చెందిన ఈ నలుగురు ఇల్లు మూసి ఉన్న పరిస్థితిలో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
ప్రాథమిక విచారణ ఆధారంగా ఈ నలుగురినీ గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో సీఐడీ, డిటెక్టివ్ బ్రాంచ్ బృందాలు సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. తల్లి ప్రీతిలత, కుమార్తె ఆగామి చక్రవర్తి ప్రార్థి మృతదేహాలు ఇంటి మెట్లపై పడి ఉండగా, గణపతి చక్రవర్తి మృతదేహం భవనం పైకప్పు (టెర్రస్)పై, 12 ఏళ్ల ప్రియం చక్రవర్తి మృతదేహం గదిలోని మంచం కింద లభించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వేకువజాము మధ్యలో ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గురువారం రాత్రి నుంచి కుటుంబ సభ్యుల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ కావడంతో బంధువులకు అనుమానం కలిగింది. శనివారం రాత్రి వారు ఇంటికి వెళ్లి చూసినప్పుడు ఇంటి తలుపు తాళం వేసి ఉండటం, లోపల లైట్లు ఆఫ్ ఉండటం గమనించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లగా, నలుగురు సభ్యుల మృతదేహాలు వివిధ చోట్ల పడి ఉన్న దృశ్యం కనిపించింది. గణపతి చక్రవర్తికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఆయన గతేడాది పదవీ విరమణ పొందిన తర్వాత హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నారని బంధువులు తెలిపారు. ఆయన కుమార్తె ఆగామి చక్రవర్తి ప్రార్థి ఈ ఏడాదే ఆంగ్లంలో మాస్టర్స్ పూర్తి చేయగా, కుమారుడు ప్రియం చక్రవర్తి ఐదో తరగతి చదువుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు.
ఈ ఘోర ఘటనపై రంగ్‌పూర్ మెట్రోపాలిటన్ పోలీస్, సీఐడీ, డిటెక్టివ్ బ్రాంచ్ బృందాలు సంయుక్తంగా సమగ్ర విచారణను వేగవంతం చేశాయి. నలుగురి మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాకే స్పష్టమవుతాయని, కేసును అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రంగ్‌పూర్ మెట్రోపాలిటన్ పోలీస్ అధికారులు వెల్లడించారు.






