రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: విదేశీ వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్1బీ వీసాలపై లక్ష డాలర్ల అదనపు ఫీజు విధించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. ఈ ఫీజు విధానం చట్ట విరుద్ధమని బోస్టన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు స్పష్టం చేసింది.
అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఈ ఫీజును విధించడాన్ని కోర్టు రాజ్యాంగ విరుద్ధ చర్యగా పరిగణించింది. కాంగ్రెస్ ఆమోదం లేని కారణంగా దీనిని చట్ట విరుద్ధ పన్నుగా చూడాల్సి వస్తుందని, అందువల్ల ఇది అమల్లో ఉండదని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరొకిన్ సోమవారం తన తీర్పులో పేర్కొన్నారు. విదేశాల్లో ఉండి అమెరికా తాత్కాలిక వలస వీసా అయిన హెచ్1బీకి ఎంపికైన వారు అదనంగా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలని గత సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ నిపుణులపై ఆర్థిక భారం పెంచే ఈ నిర్ణయం అప్పటినుంచే వివాదాస్పదమైంది.
ఈ ఫీజు విధానాన్ని సవాలు చేస్తూ 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అధ్యక్షుడికి పన్నులు విధించే అధికారం లేదని, ఆ హక్కు పూర్తిగా అమెరికా కాంగ్రెస్‌కే పరిమితమని వారు వాదించారు. ఈ పిటిషన్లన్నింటినీ ఏకీకృతంగా విచారించిన జడ్జి లియో సొరొకిన్ చివరకు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేశారు. ఈ తీర్పుతో హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేసుకునే విదేశీ వృత్తి నిపుణులకు పెద్ద ఊరట లభించినట్టైంది. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, ఇతర రంగాల నైపుణ్య కలిగిన ఉద్యోగులు ఎక్కువగా హెచ్1బీ వీసాలపై అమెరికాకు వెళ్తున్న నేపథ్యంలో, లక్ష డాలర్ల అదనపు భారం తొలగిపోవడం వారికి అనుకూల పరిణామంగా భావిస్తున్నారు.
ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను కఠినతరం చేసే క్రమంలో హెచ్1బీ వీసాలపై ఆర్థిక, పరిపాలనా పరిమితులను పెంచే చర్యలు తీసుకుంది. వాటిలో భాగంగానే ఈ లక్ష డాలర్ల ఫీజు నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో వైట్ హౌస్ వర్గాలు సూచించాయి. అయితే, ఇప్పుడు ఫెడరల్ కోర్టు జోక్యంతో ఆ నిర్ణయం అమలుకు అడ్డుకట్ట పడింది. కోర్టు తీర్పుపై ట్రంప్ ప్రభుత్వం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీజు విధానం చెల్లుబాటు కానిదిగా మారింది.







