రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తోడు సౌదీ అరేబియా–హూతీ తిరుగుబాటుదారుల మధ్య మరోసారి ఘర్షణలు చెలరేగాయి. సౌదీ అరేబియాలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని హూతీ రెబెల్స్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపారు. ఇరాన్ నుంచి హూతీ ప్రతినిధుల బృందాన్ని తీసుకువస్తున్న విమానాన్ని అడ్డుకునేందుకు సోమవారం సౌదీ మద్దతున్న యెమెన్ ప్రభుత్వం సనా అంతర్జాతీయ విమానాశ్రయ రన్‌వేపై బాంబు దాడి చేయడంతో తాజా ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.
దాదాపు నాలుగేళ్లుగా సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతు ఉన్న హూతీల మధ్య నెలకొన్న ప్రశాంతతకు ఈ దాడులు బ్రేకులు వేసినట్లుగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2022 నుంచి ఇరువర్గాలు అనధికారిక కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. సౌదీ అరేబియా, యెమెన్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వం (దక్షిణ, తూర్పు యెమెన్) మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఉత్తర యెమెన్ ప్రాంతం హూతీ రెబెల్స్ నియంత్రణలో ఉంది. ఈ గ్రూప్‌కు ఇరాన్ మద్దతు ఇస్తోంది.
సనా విమానాశ్రయంపై జరిగిన బాంబు దాడి వెనుక సౌదీ అరేబియా ఉందని హూతీలు ఆరోపించారు. ఈ దాడులకు ప్రతీకారంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించిన హూతీ తిరుగుబాటుదారులు, అభా విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించారు. తాము ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నామని సౌదీ అధికారులు వెల్లడించారు. అయితే వాటిలో కొన్ని అభా ఎయిర్‌పోర్ట్ పరిధిలో పడటంతో మంటలు చెలరేగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలాఉంటే, హూతీ తిరుగుబాటుదారుల లక్ష్యాలపై సైనిక దాడులు ప్రారంభించడానికి ముందు సహాయం కోసం అమెరికాను సౌదీ సంప్రదించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో డోనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆ తర్వాతే సనా విమానాశ్రయంపై బాంబు దాడి జరిగినట్లు విదేశీ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి.
యెమెన్‌లోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి 2015లో సౌదీ అరేబియా ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేసింది. హూతీలకు వ్యతిరేకంగా ఏర్పాటైన ఈ కూటమి చర్యల నేపథ్యంలో, ఆ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం, ఆర్థిక సంక్షోభం, ఆకలి, వ్యాధులతో యెమెన్ తీవ్ర మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
తాజా అభా విమానాశ్రయ దాడులు, సనా రన్‌వేపై బాంబు దాడి.. సౌదీ–హూతీ ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామాలు పశ్చిమాసియా ప్రాంతీయ భద్రతపై మరింత ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.







