రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: సుదీర్ఘంగా కొనసాగుతున్న ఇరాన్ యుద్ధానికి ముగింపు దశ సమీపిస్తోందని భావిస్తున్న వేళ గల్ఫ్ ప్రాంతం మరోసారి ఉద్రిక్తతలకు గురైంది. కాల్పుల విరమణ, శాంతి చర్చల ఆశలు మెదులుతున్న సమయంలో ఇరాన్ తాజా దాడులు పరిస్థితులను మళ్లీ క్షణక్షణం మారేలా చేశాయి.
శనివారం జూన్ 6న ఇరాన్ కువైట్, బహ్రెయిన్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు, స్థానిక మీడియా నివేదికలు వెల్లడించాయి. ఈ దాడులతో గల్ఫ్ ప్రాంతంలో భయానక యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి.
కువైట్, బహ్రెయిన్‌లను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుందని బహ్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. గల్ఫ్ సరిహద్దు దేశాలపై దాడులు నిలిపివేయాలని ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా బహ్రెయిన్ అధికార వర్గాలు వెల్లడించాయి.
హార్ముజ్ జలసంధి వైపు ఇరాన్ పంపిన డ్రోన్లు, క్షిపణులను అమెరికా సైన్యం కూల్చివేసిన విషయం ఇప్పటికే వెల్లడైంది. అలాగే ఇరాన్ తీర ప్రాంతంలోని రాడార్ కేంద్రాలపై కూడా దాడులు జరిపినట్లు అమెరికా ప్రకటించింది. ఈ పరిణామాల అనంతరం గల్ఫ్ దేశాలపై ఇరాన్ మళ్లీ దాడులకు దిగడం అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకునే చర్యల్లో తాము నిమగ్నమై ఉన్నామని కువైట్ మిలిటరీ ప్రకటించింది. ఒకవైపు కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం అమెరికా ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని రక్షణ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పటికే జరుగుతున్న చర్చల సమయంలోనే ఇస్రేల్ , గాజా పై దాడులు ప్రారంభించడం చర్చలకు అఘాతం కలిగించిందని ఇరాన్ ఆరోపించింది. చర్చల ప్రక్రియను పట్టించుకోకుండా ఇస్రేల్ చర్యలు కొనసాగించిందని ఇరాన్ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్రేల్ ప్రధాని నెతన్యాహు పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా తాము కృషి చేస్తున్న సమయంలో ఇస్రేల్ చర్యలతో పరిస్థితి మళ్లీ క్లిష్టమైందని అమెరికా వర్గాలు వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఇలాంటి నేపథ్యంలోని ఇరాన్ రాడార్ కేంద్రాలపై అమెరికా దాడులు జరగగా, దానికి ప్రతిస్పందనగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. బహ్రెయిన్, కువైట్ వంటి చిన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ తాజా దాడులు అక్కడి చమురు మౌలిక సదుపాయాల భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
కువైట్ చమురు సదుపాయాలపై ఇరాన్ భారీ వైమానిక దాడి జరిపినట్లు సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు, నివేదికలు వెలుగుచూశాయి. ఈ దాడిని ఇప్పటివరకు జరిగిన వాటిలో అత్యంత తీవ్రమైనదిగా అక్కడి వర్గాలు వర్ణిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్లు, అంతర్జాతీయ దౌత్య వర్గాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.







