పికాక్స్‌ పర్వత కాంప్లెక్స్‌ ధ్వంసంపై అమెరికా వ్యూహం

పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారుతున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం పక్కనపడిపోయింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సిచువేషన్ రూమ్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేదిశగా పలు కీలక అంశాలను ఆయన పరిశీలించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్ చమురు ఎగుమతికి కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం, ఆ దేశ అణు కార్యక్రమంలో కీలకమని భావిస్తోన్న పికాక్స్ పర్వతంపై దాడి చేయడం గురించి ట్రంప్‌ ఈ సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నాయి.

ఇరాన్ ఆర్థికవ్యవస్థకు ఖర్గ్ ద్వీపం అత్యంత కీలకమైంది. దానిని స్వాధీనం చేసుకుంటే.. ఇరాన్‌పై ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావొచ్చని అమెరికా ఎప్పటినుంచో భావిస్తోంది. దీంతో పాటు హర్మూజ్‌ జలసంధికి సమీపంలోని ఇరాన్ ద్వీపాలు అబూముసా, గ్రేటర్ టన్బ్‌, లెస్సర్ టన్బ్‌ను కూడా స్వాధీనం చేసుకోవాలని అగ్రరాజ్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సురక్షిత నౌకాయానం, ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు వీటిపై దృష్టి సారించినట్లు సమాచారం. కానీ ఖర్గ్‌ను సీజ్‌ చేయాలంటే.. అగ్రరాజ్య సైన్యం భూతల దాడులు చేయాల్సి ఉంటుంది. దాంతో అమెరికాకు ప్రాణనష్టం భారీగానే ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు పికాక్స్‌ పర్వత సముదాయాల (Pickaxe Mountain) వద్ద భూగర్భంలో ఇరాన్ అణుకార్యకలాపాలు నిర్వహిస్తోందని అమెరికా అనుమానిస్తోంది. ఈ ప్రాంతంలోని ఒక భూగర్భ సముదాయాన్ని ఇరాన్‌ పటిష్ఠం చేస్తోంది. ఇక్కడే శుద్ధి చేసిన యురేనియాన్ని భద్రపరిచారనే అనుమానాలున్నాయి. అందుకే ఈ ప్రాంతంలో దాడి చేసే అంశాన్ని యూఎస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇరాన్‌లోని పలు అణుస్థావరాలను అమెరికా-ఇజ్రాయెల్ టార్గెట్ చేశాయి. అయితే, భూగర్భంలో ఉన్న దీనిని ఛేదించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలాంటి ప్లాన్ ఏమీ లేదు: ఇరాన్

ఇదిలా ఉండగా.. తమతో ఇరాన్ చర్చలు కోరుకుంటోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను టెహ్రాన్‌ తోసిపుచ్చింది. ‘‘ప్రస్తుతం చర్చల గురించి ఎలాంటి ఆలోచనా లేదు. మా దేశ రక్షణపైనే పూర్తిగా దృష్టి సారించాం’’ అని ఇరాన్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది. హర్మూజ్ సమీపంలోని తమ సైనిక స్థావరాలపై దాడులు కొనసాగుతున్నందున.. అమెరికాతో అవగాహన ఒప్పందాన్ని తాము పక్కన పెట్టేశామని స్పష్టం చేసింది. మరోవైపు, ఇరాన్‌లోని చిన్నారుల క్యాన్సర్ ఆసుపత్రిపై అగ్రరాజ్యం దాడి చేయడంతో, అందులోని వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ఎప్పటిలాగే గల్ఫ్‌ దేశాల్లోని ఆ దేశ స్థావరాలపై విరుచుకుపడుతోంది.