రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: ఫ్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ విమానం కుప్పకూలిన ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తాంబ్లైన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనాల మేరకు.. ఆదివారం ఉదయం ఓ మినీ విమానం 11 మంది ప్రయాణికులతో నాన్సీ-ఎసే ఎయిర్‌ఫీల్డ్ నుంచి స్కైడైవింగ్ కోసం బయలుదేరింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో తాంబ్లైన్‌లో నివాస ప్రాంతానికి సమీపంలో కుప్పకూలింది.
దీంతో పైలట్ సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు మొదలెట్టారు. విమానం ముక్కలై పడిపోవడం వల్ల.. అక్కడ పేలుడు సంభవించే అవకాశం ఉందని అధికారులు భావించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీపంలోని రోడ్లను మూసివేశారు. స్థానికులు ఎవరూ ఆ ప్రాంతానికి రావద్దని పోలీసులు హెచ్చరించారు. కాగా, విమానం కుప్పకూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.







