రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌కు అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ (US Fed)లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఫెడరల్‌ రిజర్వ్‌ మానిటరీ పాలసీలను సమీక్షించే టాస్క్‌ఫోర్స్‌లో ఆయన సభ్యుడిగా నియమితులయ్యారు. ఫెడ్‌ కొత్త ఛైర్మన్‌ కెవిన్‌ వార్ష్‌ ఈ నియామకాలను ప్రకటించారు.

ఈ టాస్క్‌ఫోర్స్‌లో రఘురామ్‌ రాజన్‌తో పాటు భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త రాజ్‌ చెట్టి, మైక్రోసాఫ్ట్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆశా శర్మ కూడా సభ్యులుగా ఉన్నారు. ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాలెన్స్‌ షీట్‌ సమీక్ష బాధ్యతలను ఈ బృందం నిర్వహించనుంది. విధాన రూపకల్పనలో ఆర్థిక డేటాను మరింత సమర్థవంతంగా వినియోగించే అవకాశాలను కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌ పరిశీలించనుంది.

అలాగే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఉత్పాదకత, ఉపాధి కల్పనపై ఎలా ప్రభావం చూపుతున్నాయన్న అంశాలను ఈ బృందం అధ్యయనం చేయనుంది. అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంతో పాటు ఫెడరల్‌ రిజర్వ్‌ మానిటరీ పాలసీ కమిటీ విధానాలను ఆధునికీకరించే లక్ష్యంతో ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఫెడ్‌ వర్గాలు తెలిపాయి.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ స్థానంలో ఇటీవల కెవిన్‌ వార్ష్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మొత్తం ఐదు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకదానికి రఘురామ్‌ రాజన్‌ నేతృత్వం వహిస్తున్నారు. మిగతా టాస్క్‌ఫోర్స్‌లకు బ్యాంక్‌ ఆఫ్ ఇంగ్లాండ్‌ మాజీ గవర్నర్‌ మెర్విన్‌ కింగ్‌, వాల్‌మార్ట్‌ మాజీ సీఈవో డగ్‌ మెక్‌మిలన్‌, నోబల్‌ అవార్డు గ్రహీత థామస్‌ సర్జెంట్‌, సిలికాన్‌ వ్యాలీ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ మార్క్‌ ఆండ్రీసెన్‌ నేతృత్వం వహిస్తున్నారు.

ఫెడరల్‌ రిజర్వ్‌ పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా కలిసి పనిచేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు ముందుకు రావడం, ఈ టాస్క్‌ఫోర్స్‌లలో భాగస్వామ్యం కావడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు కెవిన్‌ వార్ష్‌ పేర్కొన్నారు.

రఘురామ్‌ రాజన్‌ 2013 నుంచి 2016 వరకు RBI గవర్నర్‌గా పనిచేశారు. ఆయన పదవీకాలంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, రూపాయి విలువను స్థిరీకరించడం, బ్యాంకింగ్‌ రంగంలో కీలక సంస్కరణలను ప్రారంభించడం వంటి ముఖ్య నిర్ణయాలు అమలులోకి వచ్చాయి. అంతకుముందు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ముఖ్య ఆర్థిక వేత్తగా సేవలందించారు.

ప్రస్తుతం రఘురామ్‌ రాజన్‌ షికాగో విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్‌ ఫైనాన్స్‌ రంగాలపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన, అనుభవం కారణంగా US Fed టాస్క్‌ఫోర్స్‌లో ఆయన నియామకాన్ని ఆర్థిక వర్గాలు ప్రాధాన్యంగా చూస్తున్నాయి.