ఇరాన్‌తో ఆదివారం ఒప్పందం: ట్రంప్‌ ప్రకటన, జాగ్రత్తగా స్పందిస్తున్న టెహ్రాన్‌

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం దిశగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనానికి ముగింపు పలికే అవకాశాలపై అంతర్జాతీయ వేదికపై చర్చలు ముమ్మరమయ్యాయి. శనివారం వరుసగా వెలువడిన ప్రకటనలు ఈ ప్రాంత భవిష్యత్‌ భద్రతపై దృష్టిని ఆకర్షించాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు. ఈ ఒప్పందంపై సంతకాలు కూడా జరుగుతాయని వెల్లడించారు. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా ఈ ఒప్పందం ఉండబోతోందని ఆయన స్పష్టం చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని ట్రంప్‌ మరోసారి తీవ్రంగా తప్పుబట్టారు.

“గతంలో ఒబామా ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఆ దేశం సులభంగా అణ్వాయుధాలు తయారుచేసుకునేలా ఉంది. మా ఒప్పందం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆ దేశ అణు కార్యక్రమానికి అడ్డుగోడగా నిలవనుంది”

ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తిగా నిర్వీర్యం చేశామని, వారి వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని తర్వాతి దశల్లో నాశనం చేయనున్నట్లు ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’లో పేర్కొన్నారు.

“సరైన సమయంలో.. అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మేం ఇరాన్‌లోకి ప్రవేశించి గ్రానైట్‌ పర్వతాల కింద ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని తీసుకొస్తాం”

ఇరాన్‌ అణుకేంద్రాలను B-2 బాంబర్లు నాశనం చేశాయని, దాంతో యురేనియం కుప్పకూలిన కొండల కింద చిక్కుకుపోయిందని ఆయన తెలిపారు. తీసుకొచ్చిన యురేనియాన్ని శుద్ధి చేయని యురేనియంతో కలిపి ఇరాన్‌లో లేదా అమెరికాలో నాశనం చేస్తామని, ఈ ప్రక్రియ వేగంగా, సులభంగా, ప్రశాంతంగా పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదే అంశంపై పాకిస్థాన్‌ కూడా కీలక ప్రకటన చేసింది. రానున్న 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తెలిపారు.

“గతంలో ఎన్నడూ లేనంతగా శాంతికి దగ్గరలో ఉన్నాం. రానున్న 24 గంటల్లో ఒప్పందం ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత వెంటనే ఒప్పందంపై ఎలక్ట్రానిక్‌ సంతకాలు చేయించేందుకు మేం సిద్ధమవుతున్నాం. ఈ చరిత్రాత్మక శాంతి ఒడంబడిక సుస్థిర శాంతికి బలమైన పునాదులు వేస్తుందన్న విశ్వాసం మాకుంది”

పాక్‌ ప్రధాని వ్యాఖ్యలను ఇరాన్‌ పూర్తిగా ఖండించకపోయినా, జాగ్రత్తగా స్పందించింది. ఆదివారం ఒప్పందంపై సంతకం చేయబోమని, అయితే రానున్న రోజుల్లో ఆ అవకాశం ఉండొచ్చని ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ తెలిపారు.

ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ కూడా ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్‌ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధాన్ని ముగించే ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. ఈ ప్రాథమిక ఒప్పందంలో ఇరాన్‌ అణు కార్యక్రమం అంశం లేదని, అది కుదిరిన 60 రోజుల తర్వాత అణ్వాయుధాలపై చర్చలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

ఇరాన్‌ సుప్రీం నేత అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంపై కూడా టెహ్రాన్‌ వివరాలు వెల్లడించింది. వచ్చే నెల 4న టెహ్రాన్‌లో అంత్యక్రియల ఉరేగింపులు ప్రారంభమవుతాయని, 9వ తేదీన మషహద్‌ నగరంలో అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించింది. యుద్ధం ప్రారంభమైన తొలి రోజు ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, హర్మూజ్‌ జలసంధి పరిణామాల నేపథ్యంలో అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన ఘటనపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో తాను ఈ అంశంపై మాట్లాడినట్లు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు.

“రూబియోతో మాట్లాడా. గల్ఫ్‌ ప్రాంతంలో యూఎస్‌ నౌకాదళం చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందడంపై ఇప్పటికే భారత్‌ వ్యక్తం చేసిన తీవ్ర ఆందోళనను పునరుద్ఘాటించా”

అయితే హర్మూజ్‌ జలసంధిపై తాము విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించడం తమకు ఆమోదయోగ్యం కాదని రూబియో స్పష్టం చేసినట్లు అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది. ఈ పరిణామాలన్నింటితో హర్మూజ్‌ జలసంధి భవిష్యత్‌ పరిస్థితులు, అమెరికా–ఇరాన్‌ సంబంధాల దిశపై ప్రపంచ దృష్టి కేంద్రీకృతమైంది.