అమెరికా–ఇరాన్ ఒప్పందం ప్రభావం.. తగ్గే అవాకాశం ఉన్న చమురు, ఎల్ఎన్జీ ధరలు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం ఈ నెల 19న కుదిరే అవకాశాలు ఉండటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఒప్పందంపై సంతకాలు జరిగితే భారతదేశానికి గణనీయమైన ఊరట లభించవచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇరాన్‌పై ఆంక్షలు సడలించడంతో హార్మూజ్ జలసంధి మార్గం ద్వారా సరఫరాలు సజావుగా సాగేందుకు మార్గం సుగమం కానుంది. దీంతో చమురు, ఎల్ఎన్జీ సరఫరాల్లో అంతరాయం తగ్గి, ఎరువుల సరఫరా సమస్యలు కూడా తగ్గుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడానికి ఇది తోడ్పడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 20 శాతం వరకు పడిపోయాయి. ఎల్ఎన్జీ ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయని క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ సెహుల్ భట్ తెలిపారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో మార్కెట్లలో భయాందోళనలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్, ఎల్ఎల్పీజీపై అండర్ రికవరీ విలువ సుమారు రూ. లక్ష కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇది నేరుగా నగదు నష్టం కాకపోయినా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రావాల్సిన ఆదాయంలో భారీ లోటుగా భావిస్తున్నారు. క్రూడ్ బాస్కెట్ ధర బ్యారెలుకు 90 డాలర్ల లోపు ఉంటే ఈ భారం మరింత పెరగదని విశ్లేషకులు చెబుతున్నారు.

చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గడమే కాకుండా, దేశ ఇంధన దిగుమతి బిల్లు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే గ్లోబల్ మార్కెట్లు పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి కొన్ని నెలలు పట్టవచ్చని, పాత ధరల స్థాయికి చేరుకోవడానికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు పట్టవచ్చని ఇక్రా ఎనలిస్ట్ ప్రశాంత్ వశిష్ట్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా రోజుకు 10–11 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి నిలిచిపోయిందని, కొన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులు దెబ్బతిన్నాయని ఆయన గుర్తుచేశారు.

అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం చమురు ధరలు మూడు నెలల కనిష్టానికి చేరాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మార్చి తర్వాత మొదటిసారి 80 డాలర్ల దిగువకు, 79.96 డాలర్ల వరకు పడిపోయింది. అనంతరం 3.6 శాతం తగ్గి 80.19 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ 3.8 శాతం తగ్గి 77.71 డాలర్ల వద్ద ముగిసింది.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న గ్రూప్ ఆఫ్ సెవెన్ దేశాల అధినేతల సమావేశంలో కూడా చమురు ధరల అంశం చర్చకు వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే గ్లోబల్ ఇన్వెంటరీలు తగ్గిపోవడం వల్ల చమురు ధరలు తక్షణంలోనే పాత 65 డాలర్ల స్థాయికి చేరడం కష్టమని ఎనలిస్ట్ మౌలిక్ పటేల్ అభిప్రాయపడ్డారు. సమీప కాలంలో ధరలు 75–80 డాలర్ల పరిధిలోనే ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

చైనా తన వ్యూహాత్మక నిల్వలను వినియోగించడం ద్వారా ధరలు మరింత పెరగకుండా అడ్డుకుందని ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం స్పాట్ ఎల్ఎన్జీ ధరలు 17–18 డాలర్ల మధ్యలో ఉన్నాయని, ఇవి గత ఏడాది స్థాయి అయిన 10–11 డాలర్లకు తగ్గడం సమీప కాలంలో కష్టమని మౌలిక్ పటేల్ వ్యాఖ్యానించారు.