కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హోర్ముజ్‌ జలసంధి మళ్లీ నిర్బంధం లేకుండా నౌకాయానానికి అందుబాటులోకి రానుంది.

ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందని డొనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు. ఎలాంటి సుంకాలు లేకుండా హోర్ముజ్‌ జలసంధి తెరుచుకోనుందని ఆయన తెలిపారు. ఇరాన్‌ ఓడరేవులపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. అలాగే అమెరికా నావికాదళం అమలు చేస్తున్న దిగ్బంధనాన్ని కూడా తొలగిస్తున్నట్టు స్పష్టం చేశారు.

షిప్‌ల ఇంజన్లను స్టార్ట్‌ చేయండి, ఆయిల్‌ తరలించండి.

అని ట్రంప్‌ ఉత్సాహంగా పిలుపునిచ్చినట్టు సమాచారం. ఈ ఒప్పందంతో గల్ఫ్‌ ప్రాంతం నుంచి చమురు రవాణా మళ్లీ సజావుగా సాగేందుకు మార్గం సుగమం కానుంది.

ఇక ఈ పరిణామాలపై ఇరాన్‌ కూడా అధికారికంగా స్పందించింది. అమెరికాతో అవగాహన ఒప్పందం కుదిరిందని ఇరాన్‌ ప్రకటించింది. యుద్ధ పరిస్థితులను ముగించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి ఘరీబా బాదీ వెల్లడించారు.

ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్టు ఘరీబా బాదీ తెలిపారు. ఈ దిశగా దాదాపు 60 రోజుల పాటు రెండు దేశాల ప్రతినిధి బృందాల మధ్య చర్చలు కొనసాగినట్టు ఆయన వివరించారు.

అయితే ఒప్పందం కుదిరిందని మాత్రమే శత్రువులను నమ్మినట్టుకాదని ఘరీబా బాదీ స్పష్టం చేశారు. అమెరికా ఇచ్చిన హామీలను నిజంగా అమలు చేస్తుందో లేదో ఇరాన్‌ జాగ్రత్తగా పరిశీలిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ శాంతి ఒప్పందం నేపథ్యంలో లెబనాన్‌ సహా పశ్చిమాసియాలోని ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న మిలటరీ ఆపరేషన్లు నిలిచిపోయే అవకాశాలు ఉన్నట్టు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గి, రాజకీయ–ఆర్థిక స్థిరత్వానికి ఈ ఒప్పందం దోహదం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.