రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
పశ్చిమాసియాలో శాంతి దిశగా కీలక అడుగు..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చరిత్రాత్మక 14 అంశాల అవగాహనా ఒప్పందం (MoU) తదుపరి చర్యల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లోని లూసర్న్ నగర సమీపంలో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్.. ఇరాన్ ప్రతినిధి బృందంతో సాంకేతిక స్థాయి చర్చలు జరుపుతున్నారు.
శనివారం రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌తో పాటు ఆయన సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ అమెరికా నుంచి స్విట్జర్లాండ్‌కు పయనమై ఈ ఉదయం చేరుకున్నారు.
స్విట్జర్లాండ్‌కు బయలుదేరే ముందు వాన్స్ మీడియాతో మాట్లాడుతూ, ఈ చర్చలు రెండు ముఖ్యమైన అంశాలపై కేంద్రీకృతమై ఉంటాయని స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై సందిగ్ధతను తొలగించి, ఒక నిశ్చయమైన ఒప్పందానికి రావడం ఒకటి కాగా.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అక్కడ కాల్పుల విరమణను అమలు చేయడం మరొకటని ఆయన స్పష్టం చేశారు.
'అక్కడ (లెబనాన్) పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలూ సురక్షితంగా ఉండాలనేదే మా ప్రాథమిక లక్ష్యం. పరస్పర దాడుల్లో 'కోడి ముందా-గుడ్డు ముందా' అనే సమస్యను వీడి, కాల్పుల విరమణ నిలకడగా ఉండేలా చేయడమే మా ప్రయత్నం' అని వాన్స్ పేర్కొన్నారు.







