రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
ఇరాన్ ‘ఎనర్జీ’నే టార్గెట్..
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు..?
పశ్చిమాసియాలో ఘర్షణలు తగ్గినట్లే తగ్గి.. అంతలోనే తీవ్రరూపం దాల్చుతున్నాయి. హర్మూజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ప్రపంచదేశాలకు చాటేందుకు నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఆ కారణం చెప్పి.. టెహ్రాన్‌పై అమెరికా భీకరదాడులు చేస్తోంది. రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం అటకెక్కింది. ఇలాంటి సమయంలో ఇరాన్‌లోని విద్యుత్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా భీకరదాడులు చేయాలని అగ్రరాజ్యం యోచిస్తున్నట్లు సమాచారం. దానికి ఇజ్రాయెల్ కూడా జత కలవొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ భీకరదాడుల్లో భాగంగా ఇరాన్ (Iran) లోని పవర్ ప్లాంట్లు, రిఫైనరీలను టార్గెట్ చేసే అంశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టెహ్రాన్ సైనిక కార్యకలాపాల సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ దాడులు చేయాలని భావిస్తోంది.
సోమవారం అంతర్జాతీయంగా మార్కెట్లు ప్రారంభం కావడానికి ముందే ఈ ఆపరేషన్‌ను పూర్తి చేయాలని అమెరికా (USA) అధికారులు చర్చించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మరోవైపు, ఈ ప్రతిపాదిత దాడుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్‌కు తెలియజేసినట్లు తెలుస్తోంది.
మరోసారి పూర్తిస్థాయి సైనిక చర్యలో పాల్గొనడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇజ్రాయెల్ (Israel) అధికారులు చెప్పినట్లు సమాచారం. అలాగే తమ దేశాన్ని యుద్ధంలో భాగస్వామ్యం కావాలని ఎవరూ అడగలేదని పేర్కొన్నారు. శుక్రవారం ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ దాడుల విషయం చర్చకు వచ్చినట్లు కనిపిస్తోంది. వైట్‌హౌస్‌లోని కొందరు అధికారులు వాటిని వ్యతిరేకించినట్లు సమాచారం. ట్రంప్ మాత్రం కఠినవైఖరినే ప్రకటించారని, దాడులతో లొంగిపోక తప్పని పరిస్థితుల్లో ఇరాన్‌ను ఉంచాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అగ్రరాజ్యానికి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. యూఎస్ తీసుకునే నిర్లక్ష్యపూరిత చర్యలకు ప్రతిదాడి ఉంటుందని హెచ్చరించింది.







