రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
750 డాలర్లు చెల్లిస్తే 10 రోజుల్లోనే అమెరికా వీసా ఇంటర్వ్యూ
అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితులకు చెక్ పెట్టే దిశగా డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ‘ప్రీమియం సర్వీసు’ పేరుతో ప్రత్యేక పైలట్ ప్రోగ్రామ్ను ప్రారంభించేందుకు అగ్రరాజ్యం విదేశాంగశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ఫెడరల్ రిజిస్టర్లో తాజాగా ప్రచురించిన నోటీసు ప్రకారం, బిజినెస్, టూరిస్ట్ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి అదనపు చెల్లింపుతో వేగవంతమైన ఇంటర్వ్యూ స్లాట్లు కల్పించనున్నారు. ప్రస్తుతం ఈ వీసా కేటగిరీలకు దరఖాస్తుదారులు ప్రాసెసింగ్ ఫీజుగా 185 డాలర్లు చెల్లిస్తున్నారు. దీనికి తోడు 750 డాలర్లు అదనంగా చెల్లిస్తే, ఎంపిక చేసిన అమెరికా ఎంబసీలు, దౌత్య కార్యాలయాల్లో దరఖాస్తుదారులు పేమెంట్ చేసిన 10 రోజుల్లోపే వీసా ఇంటర్వ్యూను షెడ్యూల్ చేసుకునే అవకాశం లభించనుంది.
ఈ పైలట్ ప్రోగ్రామ్ను జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంచనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ఆరు నెలలపాటు ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత, పరిస్థితులను బట్టి ఈ ప్రీమియం సర్వీసును మరింత కాలం కొనసాగించే అవకాశమున్నట్లు సూచించారు.
అయితే, ఈ పైలట్ ప్రోగ్రామ్ అమలుపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏ ఏ ఎంబసీలు, దౌత్య కార్యాలయాల్లో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుందనే వివరాలను జూలై 1కు ముందే వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎంపిక చేసిన కొన్ని మిషన్లలో మాత్రమే ఈ సదుపాయం ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వీసా విధానాలు గణనీయంగా కఠినతరం అయ్యాయి. వలసదారుల రాకను నియంత్రించేందుకు భారీ వీసా ప్రాసెసింగ్ ఫీజులు, బాండ్లు, సోషల్ మీడియా వెట్టింగ్ వంటి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా ప్రాసెసింగ్ వ్యవస్థలో ఆలస్యాలు పెరిగాయి. కొన్ని దేశాల్లో వీసా ఇంటర్వ్యూల కోసం దరఖాస్తుదారులు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు కొంత ఉపశమనం కల్పించే ఉద్దేశంతోనే ‘ప్రీమియం సర్వీసు’ను ప్రవేశపెడుతున్నట్లు అధికారులు సూచిస్తున్నారు. అయితే, అదనపు రుసుము చెల్లించడం వీసా మంజూరుకు హామీ కాదని స్పష్టం చేశారు. ఈ సదుపాయం కేవలం ఇంటర్వ్యూ తేదీని త్వరగా పొందేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. వీసా మంజూరు విషయంలో ప్రస్తుత నిబంధనలు, పరిశీలన ప్రక్రియ యథాతథంగానే కొనసాగనుంది.







