రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 4500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా రూ.15,000 స్టైపెండ్ అందజేస్తారు.
ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్రెంటిస్ విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇవి శాశ్వత ఉద్యోగాలు కాకపోయినా, అప్రెంటిస్‌గా పనిచేసే వారికి బ్యాంకు వ్యవహారాలు, పని విధానం, రోజువారీ కార్యకలాపాలపై ప్రాయోగిక అవగాహన కలుగుతుంది. ఈ అనుభవం భవిష్యత్తులో బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఇన్‌స్యూరెన్స్ సంస్థలు, ఆర్థిక సేవల సంస్థల్లో ఉపాధి పొందేందుకు దోహదం చేస్తుంది.
ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఈ అవకాశం ఉపయోగకరంగా ఉండనుంది. రియల్ టైమ్ ఆన్‌లైన్ పరీక్ష రాయడం ద్వారా తమ సన్నద్ధత స్థాయిని అంచనా వేసుకునే వీలుంటుంది. గతంలో అప్రెంటిస్‌గా పనిచేసిన వారికి మాత్రం ఈసారి దరఖాస్తు చేసే అర్హత లేదు.
దరఖాస్తు చేసుకోవాలనుకునే పట్టభద్రులు ముందుగా NATS పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం సూచించిన వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి. అభ్యర్థులు తాము పనిచేయాలనుకునే రాష్ట్రాన్ని ఎంచుకుని, ఆ రాష్ట్రానికి కేటాయించిన ఖాళీలకు పోటీ పడవచ్చు. ఎంపికయ్యే రాష్ట్ర అధికారిక భాషలో మాట్లాడటం, చదవటం, రాయటం వచ్చి ఉండాలి.
ఆన్‌లైన్ పరీక్ష వంద మార్కులకు నిర్వహిస్తారు. జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, Central Bank of India Products and Services విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రతి సరైన జవాబుకు ఒక మార్కు, రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.
ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి స్థానిక భాషలో పరీక్ష నిర్వహిస్తారు. పోటీ పడుతున్న ప్రాంతానికి చెందిన స్థానిక భాషను పదో తరగతి లేదా ఇంటర్‌లో చదివిన అభ్యర్థులకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. స్థానిక భాష పరీక్షలో ఉత్తీర్ణులైన వారి ధ్రువపత్రాలు పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహించి అప్రెంటిస్‌గా నియమిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు తెలుగు భాష చదివి ఉండాలి లేదా మాట్లాడటం, చదవటం, రాయటం వచ్చి ఉండాలి.
జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ విభాగంలో ఆర్‌బీఐ, బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకు పదజాలం, బీమా, రెపో, రివర్స్ రెపో, వడ్డీరేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు, అధిపతులు వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం, పాలిటీ, సైన్స్ వంటి విషయాల్లో ప్రాథమిక అవగాహనను కూడా పరీక్షిస్తారు. వర్తమాన వ్యవహారాల కోసం జులై 2025 నుంచి పరీక్ష తేదీ వరకు జరిగిన ముఖ్య సంఘటనలు, నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు-రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు వంటి అంశాలు చదవాలి.
జనరల్ ఇంగ్లిష్ విభాగంలో ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పు గుర్తించడం, సమానార్థకాలు, వ్యతిరేక పదాలు, తప్పు పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష-పరోక్ష వాక్యాల మార్పు, వాక్య క్రమపద్ధతి, కాంప్రహెన్షన్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్‌లో నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అరిథ్‌మెటికల్ ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తి, సరాసరి, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, డిస్కౌంట్, వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్ అంశాలు ప్రధానంగా ఉంటాయి.
కంప్యూటర్ నాలెడ్జ్ విభాగంలో Word, Excel, Internet, Web browsing, Email, URL, HTTP, Websites వంటి ప్రాథమిక అంశాలపై అవగాహనను పరీక్షిస్తారు. Central Bank of India Products and Services విభాగానికి 20 మార్కులు కేటాయించారు. ఇందుకోసం బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించి, డిపాజిట్లు, రకరకాల లోన్లు, వడ్డీ రేట్లు, ఇతర సేవలపై సమాచారం సేకరించడం అవసరం.
ఈ పరీక్షను జులై మొదటి వారంలో నిర్వహించనున్నారు. సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు సన్నద్ధతపై పూర్తి దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ప్రతి ప్రశ్నకు సుమారు 36 సెకన్ల సమయం మాత్రమే లభిస్తుంది. అందువల్ల ముందుగా సులభమైన ప్రశ్నలను పరిష్కరించి, ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివర్లో ప్రయత్నించడం మంచిదిగా భావిస్తున్నారు. రుణాత్మక మార్కులు లేనందున తెలియని ప్రశ్నలకూ ఆలోచించి జవాబులు గుర్తించవచ్చు.
గతంలో నిర్వహించిన అప్రెంటిస్ పరీక్షల ప్రశ్నాపత్రాలను సాధన చేయడం, నమూనా పరీక్షలు రాయడం, బలహీనంగా ఉన్న విభాగాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి మార్కులు సాధించే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు.
ఖాళీలు మొత్తం 4500. అందులో ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 100 పోస్టులు ఉన్నాయి. అర్హతగా డిగ్రీ నిర్దేశించారు. 2026 మే 31 నాటికి వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1998 మే 31 నుంచి 2006 మే 31 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠ వయసులో ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు విషయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.200 ఇంటిమేషన్ ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. జనరల్, ఓబీసీ మహిళలు రూ.600, మిగిలిన అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. జీఎస్టీ అదనంగా వర్తిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూన్ 22. ఆన్‌లైన్ పరీక్షలు జులై మొదటి వారంలో నిర్వహిస్తారు. మరిన్ని వివరాలు, దరఖాస్తుల కోసం వెబ్‌సైట్: https://bfsissc.com/







