రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్: రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ అఫ్ క్వాలిటీ అసురన్సు (డీజీక్యూఏ)లో టెక్నీషియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు సికింద్రాబాద్, బెంగళూరు, జబల్‌పూర్, చండీగఢ్‌లలో ఉన్న యూనిట్లలో జరగనున్నాయి.
డీజీక్యూఏలో టెక్నీషియన్ (Skilled), టెక్నీషియన్ (Semi Skilled) కేటగిరీల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ) లేదా దానికి సమానమైన సాంకేతిక కోర్సు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్ కలిగి ఉండటం అవసరం.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత నమూనాలో దరఖాస్తు పత్రాన్ని పూరించి, అవసరమైన ధ్రువపత్రాల ప్రతులతో కలిసి పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తులు చేరాల్సిన చివరి తేదీ ఆగస్టు 28గా నిర్ణయించారు. ఈ తేదీ తర్వాత చేరిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: కంట్రోల్లేరట అఫ్ క్వాలిటీ అసురన్సు (Systems), DGQA టెక్నికల్ కాంప్లెక్స్ , మనోవికాస్ నగర్ పోస్ట్ ఆఫీస్ , సికింద్రాబాద్ – 500009. అభ్యర్థులు కవర్‌పై తాము దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరు స్పష్టంగా పేర్కొనాలని నోటిఫికేషన్‌లో సూచించారు.
ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పరీక్ష తేదీ, హాల్ టికెట్, ఇతర వివరాలను తరువాత తెలియజేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత కేంద్రాల్లో పోస్టింగ్‌లు ఇస్తారు.
అర్హతలు, వయోపరిమితి, వేతన శ్రేణి, రిజర్వేషన్, దరఖాస్తు నమూనా, అవసరమైన పత్రాల జాబితా వంటి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడ్డాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదివి, సూచనల ప్రకారం పత్రాలను సిద్ధం చేసుకోవాలని డీజీక్యూఏ సూచించింది.
రక్షణ శాఖకు చెందిన ఈ సంస్థలో ఉద్యోగం పొందాలని ఆశించే సాంకేతిక అర్హతలున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. నిర్ణీత గడువులోపు దరఖాస్తు పంపితేనే ఎంపిక ప్రక్రియలో భాగమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.







