రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్: దేశ రక్షణ రంగంలో సేవ చేయాలనుకునే ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ మరోసారి అవకాశాన్ని కల్పించింది. 2027 ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (Technical) మెన్ కోర్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సు ద్వారా మొత్తం 350 లెఫ్టినెంట్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు.
గుర్తింపు పొందిన విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన లేదా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అర్హత గల అభ్యర్థులు జూలై 9 నుంచి ఆగస్టు 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన వారికి లెఫ్టినెంట్ హోదాతో పాటు బోధ్‌గయలోని మగధ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మిలిటరీ స్టడీస్ అండ్ డిఫెన్సె మానేజిమెంట్ డిగ్రీ ప్రదానం చేస్తారు.
పోస్టు పేరు షార్ట్ సర్వీస్ కమిషన్ (Technical) – SSC(T)–68 Men. మొత్తం ఖాళీలు 350. విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ 75, కంప్యూటర్ సైన్స్ 60, ఎలక్ట్రికల్ 33, ఎలక్ట్రానిక్స్ 64, మెకానికల్ 101, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ 17.
వైవాహిక స్థితి పరంగా కేవలం అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో పూర్తి స్థాయి శిక్షణ ముగిసే వరకు అభ్యర్థులు వివాహం చేసుకోకూడదు. శిక్షణకు ముందు లేదా శిక్షణ సమయంలో వివాహం చేసుకుంటే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి విధుల నుంచి తొలగిస్తారు.
ఎలిజిబిలిటీ ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 2027 మార్చి 29 తర్వాత చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ ఫలితాలు వెలువడే అభ్యర్థులు అర్హులు కారు.
వయోపరిమితి 2027 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2000 ఏప్రిల్ 1 నుంచి 2007 మార్చి 31 మధ్య జన్మించినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి. అప్లికేషన్ ఫీజు ఏదీ లేదు. దరఖాస్తుల చివరి తేదీ ఆగస్టు 7.
అభ్యర్థుల ఎంపిక కోసం షార్ట్‌లిస్టింగ్ కటాఫ్ మార్కుల వివరాలను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ఎంపిక ప్రక్రియలో షార్ట్‌లిస్టింగ్, SSB ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. మరిన్ని వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
SSB ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. Stage–1లో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే Stage–2కు అనుమతిస్తారు. మొదటి దశలో అర్హత సాధించని అభ్యర్థులను అదే రోజు తిరిగి పంపిస్తారు. SSB ఇంటర్వ్యూలు ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. 2026 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉంది.
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ప్రయాగరాజ్ (ఉత్తర్ ప్రదేశ్), భోపాల్ (మధ్య ప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), జలంధర్ (పంజాబ్)లోని ఏదో ఒక సెలక్షన్ సెంటర్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కోర్సు 2027 ఏప్రిల్‌లో ప్రారంభమై 2028 మార్చి వరకు 49 వారాలపాటు శిక్షణ కొనసాగుతుంది.
శిక్షణా కాలంలో అభ్యర్థులకు నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ పూర్తయ్యాక ప్రొబేషన్‌పై లెఫ్టినెంట్ హోదాతో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కేటాయిస్తారు. కనీస సేవా కాలం 10 సంవత్సరాలు. అర్హతను బట్టి మరో 4 ఏళ్ల పొడిగింపు అవకాశంతో గరిష్టంగా 14 సంవత్సరాల వరకు సేవలు అందించవచ్చు.
అభ్యర్థి అర్హత, సామర్థ్యం, అప్పటి నిబంధనల ఆధారంగా 10 సంవత్సరాల సేవలో పెర్మనెంట్ కమిషన్ కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తారు.







