రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నుంచి నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (NTPC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.
ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థుల కోసం మొత్తం 1,688 పోస్టులను భర్తీ చేయనున్నారు. క్లర్క్, టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ తదితర కేటగిరీలలో ఈ ఖాళీలను నింపనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన వారికి 3,548 పోస్టులను కేటాయించారు. సీనియర్ క్లర్క్, సీనియర్ టైపిస్ట్, గూడ్స్ గార్డ్, కమర్షియల్ సూపర్వైజర్ వంటి పలు కేటగిరీలలో ఈ పోస్టులు ఉంటాయి.
ఇవే కాకుండా 1,215 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి కూడా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేషన్ మాస్టర్ పోస్టులకు డిగ్రీ అర్హత అవసరమని స్పష్టం చేసింది. మొత్తం కలిపి 6,451 ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.
ఎంపిక ప్రక్రియలో రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) నిర్వహించనున్నారు. మొదటి దశ CBTలో అర్హత సాధించిన అభ్యర్థులు రెండో దశ CBTకు అర్హులు అవుతారు. టైపిస్ట్ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ తప్పనిసరి. అనంతరం అన్ని కేటగిరీల అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
ఇంటర్ స్థాయి పోస్టులకు దరఖాస్తుల సమర్పణకు నవంబర్ 13 చివరి తేదీగా నిర్ణయించారు. గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు నవంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. స్టేషన్ మాస్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నవంబర్ 25 చివరి తేదీగా పేర్కొన్నారు.
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://rrbapply.gov.in ను సందర్శించి, సంబంధిత నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, వయోపరిమితి, ఫీజు, రిజర్వేషన్ నిబంధనలు, పరీక్ష విధానం వంటి అంశాలను పూర్తిగా చదివి, సూచనల ప్రకారం దరఖాస్తు చేయాలని రైల్వే వర్గాలు సూచిస్తున్నాయి.






