కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మహారాష్ట్రకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, అతని ప్రియురాలు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదోని పట్టణంలోని బీరప్పనగర్‌లో సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్, స్థానికుల ద్వారా లభించిన సమాచారం ప్రకారం, మహారాష్ట్రలోని షోలాపుర్ నగరానికి చెందిన ప్రవీణ్ (21) ఇంటర్ వరకు చదువుకున్నారు. ఇదే నగరానికి చెందిన ఓ యువతి పదో తరగతి వరకు చదువుకుంది. వీరిద్దరూ ప్రేమించుకొని గతేడాది మార్చిలో ఇంటి నుంచి పారిపోయి ఆదోని పట్టణానికి వచ్చారు.

తమకు తెలిసినవారి సహకారంతో బీరప్పనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని గత ఐదు నెలలుగా అక్కడే నివసిస్తున్నారు. ఈ మధ్య పది, పదిహేను రోజులకోసారి ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆదోనికి వచ్చి వారి బాగోగులు చూసేవారని పోలీసులు తెలిపారు.

సోమవారం సాయంత్రం ప్రవీణ్ ఇంట్లో స్పృహ తప్పి పడిపోయారని ఆ యువతి ఇంటి పక్కన ఉన్న వారికి తెలిపింది. సమాచారం అందుకున్న పొరుగువారు ప్రవీణ్‌ను వెంటనే ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో ఆ యువతి గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

స్థితి విషమంగా ఉండడంతో ఆమెను 108 వాహనంలో ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సకు చేర్పించారు. ప్రవీణ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఘటన సమాచారం అందుకున్న ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్, ఎస్సై విజయకుమార్ తమ సిబ్బందితో కలిసి బీరప్పనగర్‌లోని ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో సాక్ష్యాధారాలను సేకరించారు.

మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారు ఆదోనికి చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు.

యువకుడి మృతి, యువతి ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో బీరప్పనగర్‌లో విషాద వాతావరణం నెలకొంది. ప్రేమజంటగా ఆదోనిలో నివసిస్తున్న వీరి జీవితంలో ఇలా విషాదాంతం చోటుచేసుకోవడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.