రాష్ట్రానికి 6 వేల కొత్త బస్సులు

ఏపీకి కేంద్రం వరాలు

జూలై నుంచి రోడ్డు పైకి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజారవాణా రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద సహకారం అందిస్తోంది. పర్యావరణహిత ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు, పాత ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను దశలవారీగా మార్చి, కొత్త ఎలక్ట్రిక్, సీ ఎం జీ (CNG) బస్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం 5,500 ఎలక్ట్రిక్ బస్సులు, 500 CNG బస్సులను రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి తీసుకురావడానికి చర్యలు ప్రారంభమయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి ఈ-బస్ సేవ’ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. వీటిలో తొలి విడతగా 300 బస్సులు జులై నెలలోనే సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. మిగిలిన 450 బస్సులు ఆగస్టు నాటికి ప్రయాణికుల సేవలోకి రానున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ఈ బస్సులను రాష్ట్రంలోని 11 ముఖ్య నగరాల్లో నడపనున్నారు. వీటిలో విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం ఉన్నాయి. ఈ నగరాల్లో నగర రవాణా సేవలను మెరుగుపరచడంతో పాటు, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.

తిరుమల ఘాట్ రోడ్డులో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం నడుస్తున్న డీజిల్ బస్సుల స్థానంలో 300 ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ బస్సులు ప్రవేశపెట్టిన తర్వాత తిరుమల ప్రాంతంలో పర్యావరణానికి కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించగలమని అధికారులు భావిస్తున్నారు.

ఆర్టీసీ స్వంతంగా కూడా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో మరో 1,450 ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకోవాలని సంస్థ యోచిస్తోంది. ఇవి 2027 మార్చి నాటికి దశలవారీగా సేవల్లోకి రానున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ‘పూర్వోదయ’ పథకం కింద వెయ్యి బస్సులు, ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకం కింద మరో 2,000 బస్సుల కోసం ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు సమాచారం.

కొత్తగా రానున్న బస్సుల రంగుల్లో ఎలాంటి మార్పులు ఉండవని, ప్రయాణికులు గందరగోళానికి గురికాకుండా ప్రస్తుతం ఉన్న బస్సుల రంగులనే కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకం, దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న ‘దివ్యాంగ శక్తి’ పథకాల కారణంగా APSRTC బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే 6,000 కొత్త బస్సులు ప్రజారవాణా ఇబ్బందులను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనున్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంధన వ్యయాన్ని తగ్గించడంతో పాటు, పర్యావరణానికి అనుకూలమైన రవాణా వ్యవస్థను బలోపేతం చేయగలమనే అంచనాలు ఉన్నాయి.