కర్నూలులో వీఆర్వో ఆత్మహత్య కలకలం…

అధికారుల వేధింపులే కారణమా?

కర్నూలు: కర్నూలు పట్టణానికి చెందిన విల్లెజ్ రెవిన్యూ ఆఫీసర్ (వీఆర్వో) మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఇంట్లో ఉరివేసుకున్న హుస్సేన్‌ను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఆత్మహత్యకు ముందు హుస్సేన్ ఒక సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. తనపై పలువురు రెవెన్యూ అధికారుల నుంచి వస్తున్న ఒత్తిడే ఈ ఆత్మహత్యకు కారణమని ఆ నోట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే సూసైడ్ నోట్‌లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. ఈ పరిణామంపై ఆగ్రహించిన హుస్సేన్ కుటుంబసభ్యులు, బంధువులు అతని మృతదేహాన్ని తీసుకుని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుటకు చేరుకుని ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, హుస్సేన్ మరణానికి కారణమైన అధికారులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.

కుటుంబసభ్యులతో పాటు సచివాలయం ఉద్యోగులు కూడా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. మృతదేహంతోనే రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కలెక్టర్ వచ్చి స్పందించాలంటూ దాదాపు రెండు గంటలపాటు ఆందోళన కొనసాగించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే కలెక్టర్ లేదా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా వచ్చి హామీ ఇవ్వాలంటూ కుటుంబసభ్యులు, ఉద్యోగులు మొండికేసి నిలబడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తరువాత సంబంధిత శాఖకు చెందిన ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని కుటుంబసభ్యులతో, ఉద్యోగ ప్రతినిధులతో మాట్లాడారు. హుస్సేన్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆందోళనకారులు మృతదేహంతో నిర్వహిస్తున్న నిరసనను విరమించారు. మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్య ఘటనపై రెవెన్యూ శాఖలోనూ చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉద్యోగులపై అధిక ఒత్తిడి, వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, బాధ్యతాయుత చర్యలు తీసుకోవాలని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.