కర్నూలు నగరంలో ‘నాగబంధం’ సినిమా బృందం సందడి చేసింది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమం భాగంగా కర్నూలు ప్రసిద్ధ కొండారెడ్డి బురుజు వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని అక్కడికి తీసుకువచ్చి, భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమంలో హీరో విరాట్ కర్ణ, హీరోయిన్ నభా నటేష్, కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు పాల్గొన్నారు. స్థానిక అభిమానులు, సినీప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరై సినిమా బృందాన్ని అభినందించారు. అభిమానులతో హీరో, హీరోయిన్ సెల్ఫీలు దిగుతూ, మాట్లాడుకుంటూ ఉత్సాహంగా గడిపారు.

సినిమా ప్రమోషన్‌ను కర్నూలు నుంచే ప్రారంభించడం ఆనందంగా ఉందని హీరో విరాట్ కర్ణ, హీరోయిన్ నభా నటేష్ పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం దృష్ట్యా ఇక్కడి నుంచే ప్రచార కార్యక్రమాలు ఆరంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

‘నాగబంధం’ చిత్రంలో పుణ్యక్షేత్రాలు, పురాణ కథలు, దేవాలయాల నేపథ్యాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు ప్రయత్నించినట్లు సినిమా బృందం వివరించింది. భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక అంశాలను ఆధునిక కథనంతో మిళితం చేస్తూ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.

జూలై 3న ‘నాగబంధం’ సినిమా విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. కుటుంబమంతా కలిసి థియేటర్లకు వచ్చి సినిమాను చూసి ఆశీర్వదించాలని ప్రేక్షకులను కోరింది. కర్నూలు నుంచి ప్రారంభమైన ఈ ప్రమోషన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు కూడా విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.