రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది. జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక పాత్రికేయులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టారు.
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని APWJF గౌరవ అధ్యక్షులు గిప్సన్, దేవేంద్ర మూర్తి, అధ్యక్షుడు షబ్బీర్ తదితరులు డిమాండ్ చేశారు. అనంతరం వారు తమ అభ్యర్థనలు, డిమాండ్లను వివరించిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసిల్దార్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా APWJF నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరారు. మీడియా రంగంలో పనిచేస్తున్న పాత్రికేయులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ప్రత్యేకంగా మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. 60 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులందరికీ పింఛన్ మంజూరు చేసి, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులను అసంఘటిత కార్మికులుగా గుర్తించి, కార్మిక భీమా పథకాలను వారికి వర్తింపజేయాలని APWJF ప్రతినిధులు కోరారు. వర్కింగ్ జర్నలిస్ట్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి, జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీని సక్రమంగా పనిచేసేలా చేయాలని సూచించారు. అలాగే జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మీడియా రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పన, శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం మీడియా అకాడమిక్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కూడా APWJF నాయకులు డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో APWJF గౌరవ అధ్యక్షులు దేవేంద్ర మూర్తి, సెక్రటరీ నాగరాజు, శంకర్, సోహెల్, లక్కీ ఖలీల్, వెంకటేష్, సునీల్, రెహమాన్, రాజు, విజయ్, సురేంద్ర, రమేష్, పార్టు, లక్ష్మణ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.













