రాయలసీమ న్యూస్, కర్నూలు: ఎమ్మిగనూరు పట్టణంలోని 10వ వార్డులో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం’ పేరుతో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా Dr. B V జయ నాగేశ్వర్ రెడ్డి స్థానిక ప్రజలను కలిసి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి వివరించినట్లు తెలిపారు. అలాగే వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, ఫిర్యాదులను గమనించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఎమ్మిగనూరు పట్టణంలో పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రెండు అన్నా క్యాంటీన్లు ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చిన విషయాన్ని Dr. B V జయనాగేశ్వర్ రెడ్డి గుర్తుచేశారు. ప్రతి రోజు వేలాది మంది నిరుపేదలు, కార్మికులు, వృద్ధులు తక్కువ ధరలో గౌరవప్రదంగా భోజనం చేసే అవకాశం పొందుతున్నారని ఆయన వివరించినట్లు పార్టీ నేతలు తెలిపారు.

ఈ సేవను మరింత విస్తరించేందుకు గోనెగండ్లలో మూడో అన్నా క్యాంటీన్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి స్థానిక స్థాయిలో భవనం ఎంపిక, అవసరమైన సదుపాయాల కల్పనపై చర్చలు కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రచార కార్యక్రమం అనంతరం Dr. B V జయనాగేశ్వర్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రానున్న పార్టీ కార్యక్రమాలు, మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. బూత్ స్థాయి బలపర్చడం, ఓటర్లను మరింతగా చేరుకోవడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించే విధానంపై నేతలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం.
ప్రజలకు అవసరమైన సేవలను వారి ఇంటి వద్దకే తీసుకెళ్లడం... అదే మా బాధ్యత, అదే మా నిబద్ధత.













