రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నప్పటికీ, దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పెట్టుబడి నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాంపౌండింగ్ ప్రయోజనం వల్ల కాలక్రమేణా వడ్డీపై వడ్డీ చేరుతూ సంపద గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో గత పదేళ్లలో అత్యుత్తమ రాబడులు అందించిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నిప్పాన్ ఇండియా ముతుల్ ఫండ్ నిర్వహిస్తున్న నిప్పాన్ ఇండియా స్మాల్ కాప్ ఫండ్ ప్రత్యేకంగా నిలిచింది.
ఈ ఫండ్ 2010 సెప్టెంబర్ 16న ప్రారంభమైంది. వేల్యూ రీసెర్చ్ , మార్నింగ్ స్టార్ సంస్థల నుంచి ఇది 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. దీర్ఘకాలంలో ఈ స్కీమ్ తన బెంచ్‌మార్క్ ఇండెక్స్ రాబడులను మించి పనితీరు కనబరిచింది. గత పదేళ్ల కాలంలో ఈ ఫండ్ వార్షిక సగటు కాంపౌండెడ్ రిటర్న్ (CAGR) 20.94 శాతం నమోదైంది. సాధారణంగా చాలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వార్షిక సగటు రాబడి 12 శాతం పరిధిలో ఉండగా, ఈ ఫండ్ అందించిన రాబడి గణనీయంగా ఎక్కువగా ఉంది.
ఇటీవలి కాలపు పనితీరును పరిశీలిస్తే, గత 3 నెలల్లో ఈ స్కీమ్ 16.15 శాతం రాబడి ఇచ్చింది. 6 నెలల వ్యవధిలో 8.45 శాతం రాబడి వచ్చింది. ఐదేళ్ల కాలానికి ఈ ఫండ్ వార్షిక సగటు రాబడి 20.38 శాతం కాగా, పదేళ్లకు 20.94 శాతం నమోదైంది. స్కీమ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు, అంటే సుమారు 16 ఏళ్లలో, వార్షిక సగటు రాబడి 20.03 శాతం వద్ద నిలిచింది.
గత 10 క్యాలెండర్ ఇయర్స్ పనితీరును చూస్తే 2018, 2019 సంవత్సరాల్లో ఈ ఫండ్ వరుసగా 16.69 శాతం, 2.52 శాతం నెగెటివ్ రిటర్న్స్ నమోదు చేసింది. అయితే 2021లో ఈ స్కీమ్ అత్యధికంగా 74.34 శాతం రాబడి ఇచ్చింది. దీర్ఘకాలంలో ఈ విధంగా రాబడుల్లో హెచ్చుతగ్గులు సహజమని నిపుణులు సూచిస్తున్నారు.
SIP రూపంలో పెట్టుబడులపై ఈ ఫండ్ ఇచ్చిన రాబడులు కూడా గమనార్హం. స్కీమ్ లాంచ్ సమయంలోనే నెలకు రూ.10 వేల చొప్పున SIP ప్రారంభించి ఉంటే, ఇప్పటి వరకు 22.26 శాతం XIRR రాబడితో ఆ పెట్టుబడి విలువ సుమారు రూ.1.36 కోట్లకు పెరిగింది. గత పదేళ్లలో మాత్రమే నెలకు రూ.10 వేల SIP పెట్టినట్లయితే, మొత్తం పెట్టుబడిపై సుమారు రూ.36.79 లక్షల వరకు సంపద పెరిగినట్లుగా లెక్కలు సూచిస్తున్నాయి. ఐదేళ్ల వ్యవధిలో నెలకు రూ.10 వేల SIP పెట్టుబడిపై సుమారు రూ.9.13 లక్షల వరకు విలువ పెరిగింది.
లంప్ సమ్ పెట్టుబడుల విషయంలో కూడా ఈ ఫండ్ మంచి రాబడులు అందించింది. స్కీమ్ ప్రారంభ సమయంలో రూ.1 లక్ష ఒకేసారి పెట్టుబడి పెట్టినట్లయితే, 16 ఏళ్లలో ఆ మొత్తం సుమారు రూ.17.78 లక్షలకు పెరిగింది. గత పదేళ్లలో రూ.1 లక్ష లంప్ సమ్ పెట్టుబడిపై సుమారు రూ.6.69 లక్షలు, ఐదేళ్లలో సుమారు రూ.2.55 లక్షల వరకు విలువ పెరిగినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి.
ఈ స్కీమ్ నిర్వహణలోని ఆస్తుల విలువ (AUM) ప్రస్తుతం సుమారు రూ.74,604 కోట్లుగా ఉంది. నిర్వహణలోని ఆస్తుల పరంగా చూస్తే, ఇది దేశంలోనే అతిపెద్ద స్మాల్ కాప్ ఫండ్ గా నిలిచింది. దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఈ ఫండ్ గణనీయమైన సంపద సృష్టి అవకాశాలను అందించినప్పటికీ, స్మాల్ కాప్ విభాగంలో వోలాటిలిటీ, రిస్క్ స్థాయిలు ఎక్కువగా ఉండటంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యాన్ని, పెట్టుబడి లక్ష్యాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.







