రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: తమిళ చిత్రసీమలో చిన్న చిన్న కథలను ఆసక్తికరంగా అల్లే ప్రయత్నాలు తరచూ కనిపిస్తుంటాయి. మన చుట్టూ జరిగే సాధారణ సంఘటనలనే తీసుకుని, వాటిని చక్కని కథనంతో చెప్పే ఆ ప్రయత్నాల్లో తాజా చిత్రం ‘మొద రాత్రి’. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళంలో నిర్మించిన ఈ చిత్రం, పెళ్లి అనే బంధంలో ఇష్టంలేకుండా అడుగుపెట్టిన యువజంట ఒక రాత్రిలో ఎదుర్కొనే భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
కథ ఏంటంటే…
దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న మారుతి (రిషికాంత్)ని ఇంట్లో ఉన్నవారు ఓ వేడుక పేరుతో స్వదేశానికి రప్పిస్తారు. వచ్చీరాగానే భావోద్వేగాలతో ఒత్తిడి చేసి, సెల్వి (అనిష్మా అనిల్ కుమార్)తో అతని పెళ్లి జరిపిస్తారు. ఈ వివాహం సెల్వికి కూడా ఇష్టం ఉండదు. ఆమె మరొకరిని ప్రేమిస్తుంటుంది. పెళ్లి ముహూర్తానికి ముందే మంటపానికి వచ్చి తనను తీసుకెళ్లిపోతానని ప్రియుడు మాట ఇస్తాడు. కానీ ఆ రోజు పూటంతా నిద్రపోయి సమయానికి రాలేకపోతాడు. మార్గం లేక సెల్వి మారుతితో మూడుముళ్లు వేయించుకుంటుంది.
శోభనం గదిలోకి వెళ్లిన తరువాత బాత్రూంలో నుంచి బయటకు దూకి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా మారుతికి కనిపిస్తుంది. తన ప్రేమకథ అంతా మారుతికి చెప్పి,
సారీ బ్రో..
అని చల్లగా చెబుతుంది. మొదట సెల్విని అసహ్యించుకున్న మారుతి, తర్వాత ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని, ప్రియుడి దగ్గరకు తానే చేర్చేస్తానని నిర్ణయించుకుంటాడు. ఆ రాత్రే ఎవరికీ తెలియకుండా ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్తాడు. అయితే ఒక్క రూపాయి సంపాదన కూడా లేని ప్రియుడు, ఆమెతో కలిసి జీవించలేనన్న భయంతో చివరి క్షణంలో వెనక్కి తగ్గిపోతాడు.
తర్వాత మారుతి, సెల్వి ఏం నిర్ణయం తీసుకున్నారు? తొలిరాత్రే ఇంటి నుంచి మాయమైన వధూవరుల కోసం బంధువులు చేసిన గాలింపులో ఏం బయటపడింది? ఆరేళ్ల క్రితం మారుతి జీవితంలో ఏం జరిగింది? చివరికి ఈ ఇద్దరి వైవాహిక బంధం కొనసాగిందా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెరపై తెలుస్తుంది.
ఎలా ఉంది?
ఒక్క రాత్రిలో జరిగే కథను దర్శకుడు రాజా కురుప్పసామి సులభంగా, వినోదాత్మకంగా నడిపించారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వధూవరుల మనస్థితి, వారు ఎదుర్కొనే భావోద్వేగాలను గంభీరంగా కాకుండా, పెళ్లింట్లో బంధువుల సందడి, మర్యాదల పేరుతో జరిగే చిన్న చిన్న గొడవలు, అమ్మలక్కల గుసగుసలు, అసమర్థుడైన ప్రియుడిని అతడి స్నేహితులు మందలించే సన్నివేశాలతో కలిపి చెప్పడం చిత్రానికి ప్రత్యేకత.
సినిమా ఎక్కువ భాగం ఒకే ఇంట్లో, ప్రధాన పాత్రధారులు దాదాపు ఒకే దుస్తుల్లో కనిపించినా, కథనం బోర్ కొట్టకుండా సాగుతుంది. అయితే ద్వితీయార్థంలో వధూవరుల కోసం వెతికే సన్నివేశాలు, పెద్దలు గాబరా పడే భాగాలు కొద్దిగా లాగినట్టుగా అనిపిస్తాయి. అలాగే తొలిరాత్రి కోసం మంచం తయారు చేసి తీసుకొచ్చే సన్నివేశాలు లేకపోయినా కథకు పెద్దగా నష్టం ఉండేది కాదు.
ఇద్దరు కలిసి జీవించాలా వద్దా అనేది ఆ ఇద్దరి నిర్ణయమే తప్ప కుటుంబం, సమాజం నిర్ణయం కాదనే భావనను సినిమా స్పష్టంగా చెబుతుంది. ప్రేమించుకోవడానికి సంపాదన అవసరం లేకపోయినా, పెళ్లి తర్వాత సంసారాన్ని నెట్టుకోవాలంటే మాత్రం ఆర్థిక స్థిరత్వం తప్పనిసరి అనే సందేశాన్ని అంతర్లీనంగా వినిపిస్తుంది. కులవివక్ష గురించి మాటల్లో గొప్పలు చెప్పుకోవడం కాదు, ఆచరణలో పాటిస్తున్నామా అనే ప్రశ్నను లేవనెత్తే ఓ సన్నివేశం కూడా ఆలోచింపజేస్తుంది.
నటీనటుల ప్రదర్శన, మొత్తం తీర్పు
చేదు గతం భారంతో ఇష్టం లేని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన యువకుడి పాత్రలో రిషికాంత్ నటన సహజంగా అనిపిస్తుంది. తొలిరాత్రే ప్రియుడి కోసం పారిపోయే యువతిగా, అపరాధ భావనతో ఉండే సెల్వి పాత్రలో అనిష్మా అనిల్ కుమార్ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో బక్స్ వినోదం పంచాడు. మిగతా నటులు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
కుటుంబంతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడదగిన చిత్రం ఇది. కథా నేపథ్యం, ప్రధాన పాత్రధారుల సహజ నటన, మధ్య మధ్యలో వచ్చే వినోదాత్మక సన్నివేశాలు బలాలుగా నిలిస్తే, కొన్ని సాగదీత, అవసరం లేని సన్నివేశాలు బలహీనతలుగా కనిపిస్తాయి. మొత్తానికి, సరదాగా గడిచిపోయే ‘మొద రాత్రి’గా ఈ సినిమాను చెప్పొచ్చు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
రేటింగ్:- 2.5/5






