ముఖ్య తారాగణం : వెంకటేష్ దగ్గుబాటి, శ్రీనిధి శెట్టి, డింపుల్ హయాతి, నివేదా పేతురాజ్ తదితరులు

దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్

సంగీతం : ఎస్‌.ఎస్‌. థమన్

నిర్మాత : ఎస్‌. రాధా కృష్ణ

విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం 47’పై సినిమా ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌. రాధా కృష్ణ నిర్మించడం, సంగీతం థమన్ అందించడం, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారనే సమాచారం ఈ అంచనాలను మరింత పెంచింది. ప్రమోషన్లు కూడా బలంగా జరిగాయి. అయితే వరుస వాయిదాలు కారణంగా ప్రేక్షకుల్లో ఆసక్తి కొంత తగ్గింది. చివరికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ

ఒక హాస్పిటల్‌లో ఉద్యోగం చేసే చిట్టిబాబు (వెంకటేష్) తన భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి), కొడుకు సర్వ (ప్రజ్వల్), కుమార్తె (యువినా పార్థవి)తో సాధారణ మధ్యతరగతి జీవితం గడుపుతుంటాడు. భార్య చీటీ కారణంగా నాలుగు లక్షలు నష్టపోవడం, కొడుకు ఆపరేషన్ కోసం మరో రెండు లక్షలు అవసరం కావడంతో డబ్బు కోసం ఆందోళన చెందుతాడు. ఇదే సమయంలో అనుకోకుండా కొన్న లాటరీ టికెట్‌కు వంద కోట్లు తగులుతాయి. దీంతో చిన్న కాలనీలో ఉంటున్న ఈ కుటుంబం పెద్ద గేటెడ్ కమ్యూనిటీకి మారుతుంది.

ఇదిలా ఉండగా, రాష్ట్రాలన్నీ తిరుగుతున్న బీహార్ డకాయిటీ గ్యాంగ్ తెలంగాణలోకి వచ్చి, ఈ కుటుంబం గెలుచుకున్న వంద కోట్లపై కన్నేస్తుంది. ఆ గ్యాంగ్‌కు చెందిన నీలా (దేవియాని శర్మ), ఆమె తమ్ముడు పింటూ అదే ఇంటిలో పనికి చేరి, సరైన సమయం చూసుకుని డబ్బు దొంగిలించాలనే ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలో ఏమి జరిగింది? బీహార్ గ్యాంగ్ ఈ ఇంటి నుంచి డబ్బు దోచుకుందా లేదా? చివరికి పరిస్థితి ఏ దిశగా వెళ్లింది? చిత్తరంజన్ (సత్య), డీఎస్పీ బృహస్పతి (రావు రమేష్), ఎస్పీ (నారా రోహిత్) పాత్రలు కథలో ఎలా మిళితమయ్యాయి? అన్నది పెద్ద తెరపై తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా అనగానే త్రివిక్రమ్ స్టైల్ డైలాగులు, ఎమోషనల్ హ్యాండ్లింగ్ ఉంటుందా? లేక కొత్తగా ఏదైనా ప్రయత్నించారా? అనే చర్చలు మొదలయ్యాయి. ఇటీవల వచ్చిన ‘బ్లాస్ట్’ సినిమాతో పోలికలు, రీషూట్ల వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్‌కి వెళ్లడం మంచిదని అనిపించే పరిస్థితి ఏర్పడింది.

సినిమా ఆరంభంలో చిట్టిబాబు పాత్రను సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా పరిచయం చేస్తూ, కుటుంబ కష్టాలు, చిన్న చిన్న గిల్లికజ్జాలు సరదాగా చూపించారు. ఒక్కసారిగా వంద కోట్ల లాటరీ తగిలే ఎపిసోడ్‌లో లాజిక్ కొద్దిగా బలహీనంగా అనిపించినా, తర్వాత రాసుకున్న సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. ప్రీ ఇంటర్వెల్‌కి వచ్చే సన్నివేశాలు, ముందుగా లాజిక్ లెస్‌గా అనిపించిన అంశాలకు సరైన కారణాలు చూపిస్తూ కథను బలపరుస్తాయి.

సెకండ్ హాఫ్ ప్రారంభంలో ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత కిక్ రాకపోయినా, కథ ముందుకు సాగే కొద్దీ ఆసక్తి మళ్లీ పెరుగుతుంది. ఒక డకాయిట్ గ్యాంగ్ ఒక కుటుంబం వెనకపడటం, ఆ కుటుంబం తమను తాము ఎలా రక్షించుకుంది అన్న అంశాన్ని ఎంగేజింగ్‌గా చూపించారు. పోలీసులతో సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా బాగానే పనిచేశాయి.

మొత్తం మీద సినిమా మొదటి నుంచి చివరి వరకు పెద్దగా బోర్ కొట్టకుండా సాగుతుంది. మధ్యలో కొన్ని చోట్ల లాజిక్ ప్రశ్నార్థకంగా కనిపించినా, తర్వాతి సన్నివేశాలతో వాటిని కవర్ చేశారు. త్రివిక్రమ్ రాసిన ట్విస్టులు ప్రేక్షకులను పట్టుకునేలా ఉన్నాయి. కొన్ని ట్విస్టులు ముందే ఊహించగలిగినవైనా, మరికొన్ని మాత్రం ఆకట్టుకుంటాయి.

నటీనటులు, సాంకేతిక విభాగం

చిట్టిబాబు పాత్రలో వెంకటేష్ పూర్తిగా ఒదిగిపోయాడు. ఈ తరహా పాత్రలు ఆయనకు సహజంగానే సరిపోతాయి. ‘దృశ్యం’లోని ఆయన పాత్ర గుర్తుకు వచ్చేలా కొన్ని షేడ్స్ కనిపిస్తాయి. ఆయన నోటి ద్వారా “నేనేనా Kamal Haasan లేదా Mohan Lal అనుకున్నావా?” అనే డైలాగ్ చెప్పించడం రిస్కీ అయినా, అదే డైలాగ్ వెంకటేష్‌కి బాగా సూటయ్యింది.

స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి నటన బాగుంది. నివేదా పేతురాజ్‌కు పెద్దగా స్కోప్ లేకపోయినా, కనిపించిన కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది. బాలనటులైన రాజా, ప్రజ్వల్, యువినా పార్థవి నటన బాగుంది. Durandar ఫేమ్ నటుడు విలన్‌గా బలంగా కనిపించాడు. దేవియాని శర్మతో పాటు మిగతా నటులందరూ తమ పాత్రల పరిధిలో న్యాయం చేశారు. నారా రోహిత్‌కు వచ్చిన ఎస్పీ పాత్ర చిన్నదైనా, ఆయన ప్రెజెన్స్ గమనించదగ్గది.

సాంకేతికంగా థమన్ తన పని చేశాడు. పాటలు పెద్దగా పాపులర్ కాకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి ప్రధాన బలం. క్లైమాక్స్, కీలక సన్నివేశాల్లో బీజీఎమ్ సినిమాను లిఫ్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్‌లో మరికొంచెం కుదించివుంటే ఇంకా బాగుండేదనే భావన కలుగుతుంది.

తీర్పు

‘ఆదర్శ కుటుంబం 47’ను ఎంగేజింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చెప్పొచ్చు. కొన్ని లాజిక్ లోపాలు, సెకండ్ హాఫ్‌లో స్వల్ప నెమ్మదితనం ఉన్నా, మొత్తం మీద కుటుంబంతో కలిసి థియేటర్‌లో చూసేందుకు సరిపోయే చిత్రంగా నిలిచింది.

రేటింగ్ : 2.75 / 5

గమనిక: ఈ సమీక్ష పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.