థింక్ సినిమా పతాకంపై రూపొందిన థ్రిల్లర్ చిత్రం ‘కిల్లర్’ అక్టోబర్ 30, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం, ఎడిటింగ్ బాధ్యతలు పూర్వాజ్ స్వయంగా చేపట్టగా, నిర్మాతలుగా పూర్వాజ్, పాడీ, పద్మనాభ రెడ్డి వ్యవహరించారు. ఆశీర్వాద్, సుమన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీని జగదీష్ బొమ్మిశెట్టి నిర్వహించారు. జ్యోతి పూర్వాజ్, చంద్రకాంత్, అర్చన అనంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌ను ముందుగానే కనిపెట్టి వాట్సప్ చేసే వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తానని దర్శకుడు పూర్వాజ్ ప్రకటించడంతో ‘కిల్లర్’ విడుదలకు ముందే వార్తల్లో నిలిచింది. ఆ ప్రచారం ప్రభావంతో ప్రీమియర్ షోలకూ ప్రేక్షకులు ఆసక్తి చూపారు. అయితే ఆడియన్స్‌కు కోటి రూపాయల బహుమతి దక్కిందో లేదో పక్కన పెడితే, ఈ సినిమా మేకర్స్‌కు కోట్లు తెచ్చేలా ఉందా అన్నది పరిశీలించాల్సిన అంశం.

కథ: కొన్ని వరుస హత్యల కేసుల దర్యాప్తు బాధ్యతలు పూర్వాజ్ (పూర్వాజ్) అనే పోలీస్ ఆఫీసర్‌కు వస్తాయి. అతనికి అసిస్టెంట్‌గా గాయిత్రి మూర్తి (అర్చన అనంత్) సహకరిస్తుంది. సాక్షులను ఒక్కొక్కరిని విచారించే క్రమంలో ఆ హత్యలన్నింటికీ ఒకే అమ్మాయి (జ్యోతి పూర్వాజ్) కారణమని తెలుస్తుంది. అదే అమ్మాయి టెర్రరిస్ట్‌గా, రక్తపిశాచి‌గా, గూఢచారిగా ఎలా మారింది? మరో వైపు కార్తీక్ (చంద్రకాంత్) అక్క రాయ్‌కు ఏమైంది? ఆమెకు ఏ ప్రమాదం ఎదురైంది? ఆమె గతంలో దాగి ఉన్న నిజం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

నటీనటుల పనితీరు: పూర్వాజ్ డాక్టర్‌గా, పోలీస్‌గా రెండు వేషాల్లో కనిపిస్తూ పాత్రను మల్టీషేడ్స్‌తో చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని యాంగిల్స్‌లో అతని లుక్స్ పూరీ జగన్నాథ్‌ను తలపించినా, చాలా సన్నివేశాల్లో అతని అవుట్ ఆఫ్ ది బాక్స్ నటన ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేలా అనిపిస్తుంది. సీరియల్స్‌లో తల్లి పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి పూర్వాజ్, ఇక్కడ అక్క పాత్రలో నమ్మకంగా నటించింది. ఆమెకు ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ కారణంగా ఆ పాత్ర బాగా సూట్ అయిన భావన కలుగుతుంది. అయితే టెర్రరిస్ట్, గూఢచారి, రక్తపిశాచి లుక్స్‌లో ఆమె మేకోవర్ అంతగా నమ్మదగినట్టుగా అనిపించదు. క్లోజప్ షాట్స్‌లో వయసు స్పష్టంగా కనిపించడం, దాన్ని కవర్ చేసేందుకు వేసిన ఓవర్ మేకప్ కూడా పనిచేయలేదు.

చంద్రకాంత్ కొల్లు నటన పరంగా బాగానే చేశాడు. అయితే అతని పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించడంతో న్యాచురల్ ఫీల్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. సీరియల్ ఆర్టిస్ట్ అర్చన అనంత్ కూడా తన వంతు పాత్రను సమర్థంగా పోషించింది. యూట్యూబ్ యాంకర్లు, పబ్లిక్ టాక్ బ్యాచ్‌గా కనిపించిన పలువురు నటులు ఉన్నా, వారి పాత్రలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

సాంకేతిక నిపుణుల పనితీరు: పూర్వాజ్ ఈ సినిమాను కేవలం 25 రోజుల్లో, సుమారు రూ.5 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేశానని ప్రమోషన్లలో పేర్కొన్నాడు. టీజర్, ట్రైలర్‌లలో కనిపించిన విజువల్స్ చూసి ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయనిపించినా, పూర్తి సినిమా చూస్తే ఆ ఫీల్ అంతగా రాదు. సినిమాటోగ్రఫీ మాత్రం కొంతవరకు ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బలహీనంగా అనిపిస్తుంది. పాటలు లేకపోవడం మాత్రం ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

కథనం పరంగా చూస్తే, కొన్ని కథలు పేపర్‌పై బాగానే కనిపిస్తాయి. కానీ వాటిని తెరపై ఆవిష్కరించే సమయంలో లోపాలు వస్తే ఫలితం పూర్తిగా మారిపోతుంది. ‘కిల్లర్’ విషయంలో కూడా ఇదే జరిగింది. ఫస్ట్ హాఫ్‌లో మల్టీ లేయర్ నేరేషన్ పేరుతో దర్శకుడు ప్రేక్షకులను గందరగోళానికి గురి చేశాడు. హీరోయిన్ గ్లామర్ సీన్లు, ఇంటరాగేషన్ ఎపిసోడ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ భాగం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. సౌండ్ మిక్సింగ్‌లోనూ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొందరి వాయిస్‌లు రీ-సౌండ్ రావడం, లౌడ్‌నెస్ అసమానంగా ఉండటం వల్ల డబ్బింగ్ సినిమా చూస్తున్న భావన కలుగుతుంది.

ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ ట్విస్ట్‌ను ఊహించడం పెద్ద కష్టం కాదు. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంత బెటర్‌గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ వెనుక ఉన్న బ్యాక్ స్టోరీని దర్శకుడు కొంత బాగా డిజైన్ చేశాడు. సినిమా రన్‌టైమ్ తక్కువగా ఉండటం కూడా మరో ప్లస్ పాయింట్.

విశ్లేషణ: ‘కిల్లర్’ ఫస్ట్ హాఫ్ మొత్తం డబ్బింగ్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొంతవరకు పర్వాలేదనిపించే స్థాయిలో ఉంటుంది. ఇలాంటి మేధావితనంతో నిండిన కథలను థియేటర్లలో ప్రేక్షకులు పూర్తిగా ఫోకస్‌తో చివరి వరకు చూసేలా చేయడం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. ప్రీమియర్ షోల వరకు కోటి రూపాయల బహుమతి హంగామా వల్ల అటెన్షన్ దక్కినా, రిలీజ్ తర్వాత రోజువారీగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే శక్తి మాత్రం ఈ సినిమాకు తక్కువగానే కనిపిస్తుంది.

ఫోకస్: అటెంప్ట్ కొత్త.. టేకింగ్ పాత

రేటింగ్: 2/5

గమనిక: ఈ సమీక్ష పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.