రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
రివ్యూ: సినిమాను మించి ‘బాహుబలి: ద టార్చ్ బేరర్’
తెలుగు సినిమా పంథాను పూర్తిగా మార్చిన చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా వచ్చిన ఈ మహా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అనేకసార్లు థియేటర్లలో, టీవీలో, మొబైల్ ఫోన్లలో చూసి మళ్లీ మళ్లీ ఆస్వాదించారు. ఇప్పుడు ఆ చిత్రానికి తెర వెనక జరిగిన సంగతులను, ప్రయాణాన్ని చూపిస్తూ ‘బాహుబలి: ద టార్చ్ బేరర్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. మూడు రోజుల క్రితం Netflix వేదికగా విడుదలైన ఈ డాక్యుమెంటరీ సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సాధారణంగా డాక్యుమెంటరీ అంటే కూర్చొని మాట్లాడే ఇంటర్వ్యూల సమాహారమే అన్న అభిప్రాయం ఉంటుంది. ‘బాహుబలి: ద టార్చ్ బేరర్’ ప్రకటించినప్పుడు కూడా చాలామంది అలాంటి అంచనాలకే పరిమితమయ్యారు. అయితే 123 నిమిషాల నిడివితో నాలుగు ఎపిసోడ్లుగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా ఆకట్టుకుంటోంది. ‘ద డ్రీమ్’, ‘బిల్డింగ్ ద డ్రీమ్’, ‘బియాండ్ డ్రీమ్స్’, ‘ద టార్చ్ బేరర్’ పేర్లతో ఎపిసోడ్లు విభజించారు.
‘బాహుబలి’ చేయాలనే ఆలోచన దర్శకుడు S.S. రాజమౌళి కి ఎలా వచ్చింది? ఆ కల ఎలా రూపుదిద్దుకుంది? ఆ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ప్రధాన పాత్రధారులైన ప్రభాస్ , రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి , సత్యరాజ్ , రమ్య కృష్ణ , నాసర్ ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు? మొదట ఊహించిన బడ్జెట్ రోజురోజుకీ ఎలా పెరిగిపోయింది? ఒక భాగంగా ప్లాన్ చేసిన సినిమా రెండు భాగాలుగా ఎలా మారింది? అప్పటి పరిస్థితుల్లో వందల కోట్ల బడ్జెట్‌తో సినిమా తీయడం ఎంతటి సాహసమో నిర్మాతలు వివరించారు. ఆ సమయంలో తీసిన ఫుటేజీని చూపిస్తూ ఆ అనుభవాలను పంచుకోవడం ప్రేక్షకులకు క్రేజీగా అనిపిస్తోంది.
ముఖ్యంగా రెండో ఎపిసోడ్ చివర్లో ‘బాహుబలి’కి తెలుగులో మొదట వచ్చిన ఫ్లాప్ టాక్ కారణంగా రాజమౌళి , మూవీ టీమ్ అంతా ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని, ఆందోళనను వివరించారు. సినిమా నష్టాలను భరించేందుకు మణికొండ లో తనకు ఉన్న స్థలాన్ని అమ్మేయాలని రాజమౌళి ఆలోచించిన విషయాన్ని ఆయన భార్య రామ రాజమౌళి చెప్పిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.
ఈ డాక్యుమెంటరీలో నటీనటుల శ్రమ నుంచి రాజమౌళి విజన్ వరకు, ఆ విజన్‌ను నిజం చేయడానికి ప్రతి విభాగం ఎంతగా కష్టపడిందో విపులంగా చూపించారు. సాధారణ సినిమాల్లో ఉండేలా ఇందులో కూడా హై మూమెంట్స్ ఉన్నాయి. ‘బాహుబలి’ ప్రభావం ప్రపంచంలోని లక్షల జనాభా కలిగిన చిన్న చిన్న దేశాల వరకు ఎలా వ్యాపించిందో వివరించారు.
ఓసారి Bangkokలో డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం డైరెక్టర్ పూరి జగన్నాధ్ వెళ్తే గంటసేపు వేచి ఉండమని చెప్పారు. నేను ‘ బాహుబలి ’ ఫ్రెండ్ అని చెప్పగానే ఆ డాక్టర్ వెంటనే నాకు ట్రీట్‌మెంట్ ఇచ్చేశాడు.
అని ప్రభాస్ ఈ డాక్యుమెంటరీలో చెప్పిన సంఘటన విశేషంగా నిలిచింది.
ఈ సినిమాలో నేను చేసిన కుమార్ వర్మ పాత్ర వల్ల జపాన్ లో నాకు అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అక్కడి ఓ మహిళా అభిమాని చనిపోగానే ఆమె భర్త వచ్చి నన్ను కలవడం నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించింది.
అని నటుడు సుబ్బరాజు పంచుకున్న అనుభవం ప్రేక్షకులను కదిలిస్తోంది.
‘బాహుబలి’ రెండో భాగం కోసం ఎదురు చూస్తూ, ఇది రాకముందే నేను చనిపోతానేమోనని భయపడ్డాను అని ఓ క్యాన్సర్ పేషెంట్ తన వదినతో చెప్పాడు.
అని రాజమౌళి ఈ డాక్యుమెంటరీలో వెల్లడించారు.
మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం? సాహో అని ప్రపంచము! తానూ నమ్మిన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతుంటే, తలొంచదా విధి సైతం! జై మహిష్మతి!
అని రాజమౌళి చెప్పిన మాటలతో డాక్యుమెంటరీని ముగించిన తీరు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
‘బాహుబలి’కి మూడో భాగం కూడా ఉండే అవకాశముందని ప్రభాస్ , రానా దగ్గుబాటి , అనుష్క శెట్టి ఈ డాక్యుమెంటరీ చివర్లో హింట్ ఇవ్వడం అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రేటింగ్: 3/5 (ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)







