రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్:
రివ్యూ ‘హే చికీతా’పల్లె జీవితం, రైతు గౌరవం నేపథ్యంగా
అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘హే చికీతా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ సినిమాను అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించారు. ధనరాజ్ లెక్కల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జూలై 24న విడుదల చేశారు.
నాగనూరు, లచ్చక్కపేట గ్రామాల నేపథ్యంతో సాగే ఈ చిత్రం పక్కా విలేజ్ డ్రామాగా రూపొందింది. ఊర్లో చదువు సరిగ్గా అబ్బక, ముక్కు మీద కోపంతో ఉండే శివ (అభినవ్ మణికంఠ) వ్యవసాయాన్ని జీవితం గా భావించి బతుకుతుంటాడు. అతనికి చిట్టి (దివిజ), పొట్టి (తన్మయ్ ఖుషి) అనే ఇద్దరు మరదళ్లు ఉంటారు. చిన్నప్పటి నుంచే శివ, చిట్టిల మధ్య ప్రేమ ఉన్నప్పటికీ, స్థిరమైన ఉద్యోగం ఉన్న వ్యక్తికే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని చిట్టి తండ్రి పట్టుదలగా నిలుస్తాడు.
వినాయక చవితి ఉత్సవాల ఊరేగింపులో స్థానిక రౌడీ గ్యాంగ్‌తో జరిగే గొడవ శివ జీవితానికి కీలక మలుపు తీసుకొస్తుంది. కోపంలో ఒకరిని కత్తితో పొడవడంతో శివ జైలు పాలవుతాడు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత సమాజం నుంచి ఎదురయ్యే విమర్శలు, మరదలికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరగడం వంటి పరిణామాలు అతని జీవితాన్ని సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెడతాయి. చదువు లేని రైతుగా సమాజంలో చిన్నచూపు చూసే మామ పంతాన్ని శివ ఎలా ఎదుర్కొన్నాడు? రెండు ఊళ్ల పంచాయితీగా మారిన ఈ ప్రేమకథ చివరకు ఎలా సుఖాంతమైంది? అనేదే ‘హే చికీతా’ కథ.
సినిమా ప్రారంభం నెమ్మదిగా సాగినా, పల్లెటూరి వాతావరణం, కుర్రాళ్ల అల్లరిని సహజంగా చూపించడంలో దర్శకుడు ధనరాజ్ లెక్కల సఫలమయ్యారు. ప్రథమార్ధంలో బావామరదళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎక్కడా అశ్లీలతకు తావులేకుండా, కుటుంబ సమేతంగా చూడదగిన విధంగా కథనాన్ని మలచడం విశేషం. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ కథలో ఉత్కంఠను పెంచుతుంది.
సెకండ్ హాఫ్‌లో కథ మరింత భావోద్వేగంగా మారుతుంది. ముఖ్యంగా రైతు సేవలు, వ్యవసాయం ప్రాముఖ్యత, రైతు పట్ల సమాజంలో ఉన్న చులకన భావాన్ని ప్రశ్నించే సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉన్నాయి. క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుడికి సంతృప్తిని కలిగిస్తాయి. అయితే కథలో కొంత రొటీన్ భావన కలుగుతుంది. ఆ అంశంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే ఫలితం మరింత బలంగా ఉండేదనే అభిప్రాయం కలుగుతుంది. ఫస్టాఫ్ అంతా సెకండాఫ్‌లో వచ్చే కథను ఎస్టాబ్లిష్ చేయడానికే వినియోగించినట్లు కనిపిస్తుంది. నిడివి తక్కువగా ఉండడం కొంతవరకు సినిమాకి ప్లస్‌గా మారింది.
అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు కుర్రాళ్లు బాధ్యతలు తెలుసుకొని చివరికి ఎలా ప్రయోజకులయ్యారనే ఆసక్తికరమైన లైన్‌తో కథను రాసుకున్నప్పటికీ, దాన్ని తెరపై అంతగా బలంగా చూపించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే అభినవ్ మణికంఠ ‘శివ’ పాత్రలో ఒదిగిపోయారు. పక్కింటి కుర్రాడిలాంటి లుక్స్‌తో, కోపంతో ఊగిపోయే యువకుడిగా, భావోద్వేగ సన్నివేశాల్లోనూ చక్కని నటన కనబరిచారు. చిట్టిగా దివిజ తన సంభాషణలతో, హావభావాలతో ఆకట్టుకోగా, పొట్టి పాత్రలో తన్మయ్ కూడా మంచి అభినయాన్ని ప్రదర్శించారు. దేవి ప్రసాద్ రాజన్న పాత్రలో నిలకడైన నటన చూపించగా, కల్లు మామ పాత్ర నవ్వులు పూయిస్తూ చివర్లో కీలక మలుపు తీసుకొచ్చేలా ఉంటుంది. హీరో స్నేహితులుగా నటించిన వారు తమ పరిధి మేర బాగా చేశారు.
సాంకేతికంగా ‘గరుడవేగ’ అంజి పల్లెటూరి అందాలను, గ్రామీణ నేపథ్యాన్ని సహజంగా కెమెరాలో బంధించారు. ప్రతి ఫ్రేమ్ విజువల్‌గా బాగా కనిపిస్తుంది. చరణ్ అర్జున్ స్వరపరిచిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. ప్రేమకథ, విషాద సన్నివేశాలకు తగినట్లుగా నేపథ్య సంగీతం సీన్లను ఎలివేట్ చేసింది. ధనరాజ్ లెక్కల యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌కు ‘రైతే రాజు’ అనే సామాజిక సందేశాన్ని జోడించి నేరేట్ చేసిన తీరు మెచ్చుకోదగ్గది. ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, అంజిలు రాజీ పడకుండా నిర్మించిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్, కాస్ట్యూమ్స్ విలేజ్ అట్మాస్ఫియర్కు అనుగుణంగా ఉన్నాయి.
మొత్తం గా ‘హే చికీతా’ వింటేజ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు, రైతు జీవితం నేపథ్యంగా సాగే కథలు ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది.
రేటింగ్ 2.5/5







