టాలీవుడ్ కమెడియన్ హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన “లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” వెబ్‌సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీతో పాటు Netflix‌లో విడుదలైంది. Jabardasth ఫేమ్ బాబు డేగల దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఐశ్వర్య హోలక్కల్, హైపర్ ఆది, జీవన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. వయోన ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించిన ఈ సిరీస్‌కు అజయ్ అరసాడ సంగీతం, శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ, లికిత్ లీ ఎడిటింగ్ అందించారు. అక్టోబర్ 9, 2026న విడుదలైన ఈ ఫన్ లవ్ స్టోరీ వెబ్‌సిరీస్ ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ

పల్నాడు జిల్లాలోని రెంటచింతల గ్రామానికి చెందిన శ్రీనివాసరావుకు డబ్బు, పరపతి అన్నీ ఉన్నా… కొడుకు తేజ (హర్ష చెముడు) పెళ్లి కావడం లేదనే ఆందోళన అతడిని వేధిస్తుంది. ఊరిలో ఏ అమ్మాయి తేజను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాదు. పెళ్లి కావాలంటే ఉద్యోగం ఉండాలనే స్నేహితుడి సలహాతో తేజ హైదరాబాద్‌కు వస్తాడు. వయోన అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో అతనికి ఉద్యోగం దొరుకుతుంది.

ఆఫీస్‌లో తేజకు టీమ్ లీడ్‌గా మధు (ఐశ్వర్య హోలక్కల్) పనిచేస్తుంది. అమెరికా వెళ్లాలనే లక్ష్యంతో ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో తేజ, మధు ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉండాల్సి వస్తుంది. అదే కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న నాయుడు (జీవన్ కుమార్) తన ఆఫీస్‌లో పనిమనిషిగా పనిచేసే సునీతను ప్రేమిస్తుంటాడు. ఆ విషయాన్ని ఆమెకు చెప్పడానికి భయపడుతుంటాడు.

గోపీ (హైపర్ ఆది) టీమ్ లీడర్. తన కింద పనిచేసే అనూష (శ్రావ్య చౌదరి)ను ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు. గోపీ ఓ మోడల్‌తో ప్రేమలో పడతాడు. ఆ మోడల్… అనూష ఒక్కరే అన్న నిజం అతనికి తెలిసిందా? తేజ, మధు ఒకే ఫ్లాట్‌లో ఉండటానికి అసలు కారణమేంటి? తేజను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మధు చివరికి అమెరికా వెళ్లిపోయిందా? నాయుడు ప్రేమను సునీత అర్థం చేసుకుందా? అన్నదే ఈ వెబ్‌సిరీస్‌లోని మిగతా కథ.

నటీనటుల ప్రదర్శన

తేజ పాత్రలో హర్ష చెముడు కామెడీ టైమింగ్ బాగా పనిచేసింది. తక్కువ డైలాగ్స్, ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వులు పంచాడు. ఇంటర్వ్యూ ఎపిసోడ్, తండ్రితో కలిసి అమ్మాయికి సైట్ కొట్టే సీన్ హిలేరియస్‌గా నిలిచాయి. మొత్తం సిరీస్‌లో కామెడీ పరంగా హైపర్ ఆది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచాడు. అతడి పంచ్‌లు నాన్‌స్టాప్‌గా నవ్విస్తాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కష్టాలు, గొప్పతనం గురించి చెప్పే ఎమోషనల్ సీన్‌లో కూడా అతడి నటన బాగుంది.

సాఫ్ట్‌వేర్ గురించి ఏం తెలియని మేనేజర్ పాత్రలో జీవన్ కుమార్ పాత్రను డైరెక్టర్ ఫన్నీగా రాశారు. మధు పాత్రలో ఐశ్వర్య హోలక్కల్ సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. హైపర్ ఆది, అనూష పాత్ర చేసిన శ్రావ్య చౌదరి కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సీన్ నుంచి కామెడీ బాగా జనరేట్ అయింది. జీవన్ కుమార్‌కు జోడీగా శ్రీవిద్య నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. హర్ష చెముడు తండ్రి పాత్రధారి ప్రస్టేషన్ వినోదాన్ని పంచినా, బూతులు ఎక్కువయ్యాయి.

సాంకేతిక విభాగం

“లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” కోసం బాబు డేగల రాసుకున్న కథ కొత్తదేమీ కాదు. ఇదే పాయింట్‌తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ట్రీట్‌మెంట్ విషయంలో కొంత భిన్నంగా ఆలోచించాడు. Gen Z ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం సిరీస్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. కామెడీ ఆరంభంలో బాగున్నా, ఎపిసోడ్స్ ముందుకు సాగే కొద్దీ తగ్గుతూ వచ్చింది.

కీలకమైన మధు–తేజ లవ్ స్టోరీని ఇంకాస్త డెప్త్‌తో రాసుంటే బాగుండేదనే భావన కలుగుతుంది. వెబ్‌సిరీస్ అయినా ఇందులో పాటలు ఉన్నాయి. ట్రిప్ సీన్‌లో వచ్చే పాట మెలోడీ ప్రాధాన్యంతో బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిలో ఉంది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.

విశ్లేషణ

మూడు జంటల చుట్టూ సాగే కథతో “లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ముందుకు సాగుతుంది. ప్రేమ, పెళ్లితో పాటు ఉద్యోగ జీవితంలో వారు ఎదుర్కొనే సమస్యలను వినోదాత్మకంగా చూపించేందుకు డైరెక్టర్ బాబు డేగల ప్రయత్నించాడు. సెంటిమెంట్, ఓవర్ ఎమోషన్స్‌కి దూరంగా ఉండి, ప్రతి సీన్ నుంచి కామెడీని రాబట్టే దిశగా నడిపించాడు.

సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సీన్లలోని ఫన్ ఈ సిరీస్‌ను కొంతవరకు కాపాడింది. కర్సర్ మిస్సయ్యిందని ఓ ఉద్యోగి మేనేజర్‌కు కంప్లైంట్ ఇవ్వడం, ప్రాజెక్ట్ ఫైల్ పేర్ల గురించి గోపీ–అనూష మధ్య సాగే సంభాషణ, హీరో ఇంటర్వ్యూ ఎపిసోడ్ నవ్వించాయి. అదే టెంపో చివరి వరకు కొనసాగి ఉంటే మరింత ఎంటర్‌టైనింగ్‌గా ఉండేది. పోనుపోను కామెడీ డోస్ తగ్గిపోవడం గమనార్హం.

అంత్యాక్షరి ఎపిసోడ్, ట్రిప్ పేరుతో దర్సకుడు సిరీస్‌ను సాగదీసిన భావన కలుగుతుంది. క్లైమాక్స్ కూడా ముందే ఊహించదగ్గలా ఉంటుంది. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో బాబు డేగల ఈ సిరీస్‌ను తెరకెక్కించాడు. ప్రతి ఎపిసోడ్ లెంగ్త్ ముప్పై నిమిషాలకు మించి ఉండటం వల్ల పేస్ కొంత మందగిస్తుంది. కథ కోసం కాకుండా కామెడీ కోసం చూస్తే “లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” టైమ్‌పాస్‌గా అనిపిస్తుంది.

ఫోకస్ పాయింట్: చాలా మంది కమెడియన్లు ఉన్నా… న‌వ్వులు మాత్రం కొన్నే.

రేటింగ్: 2.5/5

గమనిక:- ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!