నేటి తరానికి నచ్చేలా ప్రేమకథలను వినోదాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. అలాంటి ప్రయత్నాల్లో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘లవ్‌ ఓ లవ్‌’. ధనుశ్‌ మేనల్లుడు పవిశ్‌ నారాయణ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంతో, తెలుగు నటి నాగదుర్గకు తమిళంలో ఇది తొలి చిత్రం. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైన ఈ న్యూ ఏజ్‌ లవ్‌ డ్రామా ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

రఘు (పవిశ్‌) కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతడి ప్రపంచం అమ్మానాన్న, చెల్లితోనే పరిమితం. అప్పు చేసి ఏదీ కొనకూడదని, చేతిలో డబ్బు ఉన్నప్పుడే కొనాలని తండ్రి (కేఎస్‌ రవికుమార్‌) ఎప్పుడూ చెప్పే మాట. ఆ విలువలకు కట్టుబడి జల్సాలకు దూరంగా, పద్ధతిగా జీవించే రఘు ఓ కార్యక్రమంలో అవంతిక (నాగదుర్గ)ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. రఘు ప్రేమను అవంతిక కూడా అంగీకరిస్తుంది.

ఇద్దరి ప్రేమ ప్రయాణంలో జరిగే సంఘటనలే కథకు ప్రాణం. అవంతిక కోసం బైక్‌, సినిమాలు, షికార్లు, గిఫ్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు ఇలా వరుస ఖర్చులతో రఘు అప్పుల బారిన పడతాడు. ఆర్థిక ఒత్తిడితో ఉద్యోగం కోల్పోయి, కుటుంబానికి దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు (వనితా విజయ్‌కుమార్‌) రఘును పోలీస్‌స్టేషన్‌కు పిలిచి పంచాయతీ పెట్టే సన్నివేశంతో కథ మొదలవుతుంది. అక్కడ నుంచి రఘు తన కుటుంబ నేపథ్యం, అవంతికను ఎలా కలిశాడు, ప్రేమ ఎలా మొదలైంది అన్నదాన్ని ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్లే విధానం వినోదాన్ని పంచుతుంది.

నేటి జెన్‌-జీ మనస్తత్వాలు, వారి మధ్య ఆకర్షణలు, గొప్పల కోసం చేసే అధిక ఖర్చులు, వాటి వల్ల తల్లిదండ్రులు పడే ఇబ్బందులు వంటి అంశాలను దర్శకుడు మహేశ్‌ రాజేంద్రన్‌ చక్కగా మేళవించారు. అమ్మాయిల మెప్పుకోసం అబ్బాయిలు పడే ఇబ్బందులను సరదాగా చూపించిన విధానం ప్రథమార్ధంలో బాగా పనిచేసింది. రఘు జీవితంలో తాను ఏం కోల్పోయాడో గ్రహించే దశ నుంచి కథ మలుపు తిరుగుతుంది. రఘు దుబాయ్‌ వెళ్లకుండా మహిళా మండలి అధ్యక్షురాలు అడ్డుకోవడం, దానికి ప్రతిగా రఘు అవంతికకు పెట్టే షరతులతో ద్వితీయార్ధం ముందుకు సాగుతుంది.

‘లవ్‌ టుడే’లో ఫోన్‌లు మార్చినట్లుగా ఇక్కడ పాత్రలను మార్చే కాన్సెప్ట్‌ కొంత కొత్తగా అనిపించినా, కథ ఒక దశ తర్వాత ముందుకు కదలకుండా రొటీన్‌గా మారుతుంది. రఘు చేసే పనులు టిట్‌ ఫర్‌ ట్యాట్‌ తరహాలో సాగడం, కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా అనిపించడం వల్ల ప్రభావం తగ్గింది. క్లైమాక్స్‌ వద్ద కథ ఎమోషనల్‌ టర్న్‌ తీసుకున్నా, రఘుతో అంత ఖర్చు పెట్టించడం వెనుక అవంతిక చెప్పే లాజిక్‌ అంతగా ఆకట్టుకోదు. సీక్వెల్‌ ఉంటుందని హింట్‌ ఇస్తూ కథను ముగించారు.

నటన పరంగా పవిశ్‌ సగటు యువకుడి పాత్రలో సహజంగా నటించాడు. అమ్మాయి కోసం అప్పులు చేసి, తిప్పలు పడే యువకుడి భావోద్వేగాలను అతడు బాగా మలిచాడు. నాగదుర్గ ఈతరం అమ్మాయిగా తన పాత్రలో ఒదిగిపోయింది. మధ్యతరగతి తండ్రిగా కేఎస్‌ రవికుమార్‌ నాటకీయతకు లోనుకాకుండా నమ్మకంగా కనిపించారు. ఇన్‌స్పెక్టర్‌గా సెల్వరాఘవన్‌, మహిళా మండలి అధ్యక్షురాలిగా వనితా విజయ్‌కుమార్‌ నవ్వులు పూయించారు.

సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. నేటి యువతకు కనెక్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌ను ఎంచుకుని, వినోదాత్మకంగా చెప్పడంలో దర్శకుడు మహేశ్‌ రాజేంద్రన్‌ విజయవంతమయ్యారు. ప్రేమ, డబ్బు విలువ, స్నేహం, తల్లిదండ్రుల బాధ్యతలను ఒకే కథలో మేళవించే ప్రయత్నం చేశారు. అయితే ద్వితీయార్ధంపై మరింత శ్రద్ధ పెట్టి, క్లైమాక్స్‌లో ఎమోషనల్‌ డ్రామాను బలంగా పండించి ఉంటే ప్రభావం మరింత పెరిగేది.

డబ్బులు దాచిపెట్టి ఏదైనా కొనుక్కోవచ్చు. కానీ, ఏదో కొనాలని అప్పులు పాలు అవకూడదు

అలాంటి సంభాషణలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. కుటుంబంతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడదగిన చిత్రమిది. అసభ్య సన్నివేశాలు, సంభాషణలు లేకపోవడం ప్లస్‌ పాయింట్‌. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉన్న ‘లవ్‌ ఓ లవ్‌’ యువతను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్న ప్రేమకథగా నిలిచింది.

బలాల విషయానికి వస్తే పవిశ్‌, నాగదుర్గ నటన, ప్రథమార్ధం, యువతను ఆకట్టుకునే అంశాలు ప్లస్‌. బలహీనతలుగా ద్వితీయార్ధం నెమ్మదిగా సాగడం, క్లైమాక్స్‌ అంతగా ప్రభావం చూపకపోవడం చెప్పుకోవచ్చు. మొత్తానికి, యువతను ఆకట్టుకునే ‘లవ్‌ ఓ లవ్‌’ ఓ సారి చూడదగిన ఓటీటీ ఎంటర్‌టైనర్‌.