హీరో సుమంత్ కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌కు ‘మళ్ళీరావా’ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత ‘సీతా రామం’, ‘సార్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘అనగనగా’ ద్వారా ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న సుమంత్, తాజా చిత్రమైన ‘Newton’s 3rd Law’లో ప్రధాన పాత్రలో కనిపించాడు. మార్క్ మై వర్డ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ కోహిర్కర్ నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ కర్ణ దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్ అసోసియేషన్‌తో రూపొందిన ఈ థ్రిల్లర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సిక్కింలోని జులుక్‌లో 2026 నేపథ్యంలో కథ మొదలవుతుంది. డేవిడ్ అలియాస్ కిషోర్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ ‘న్యూటన్స్ థర్డ్ లా పార్ట్ 1’ పుస్తకం చదువుతూ ఉంటాడు. అక్కడి నుంచి కథ 1999కి మారుతుంది. జ్యోతి పాత్రలో నేహా పఠాన్ తన భర్త మరణించిన వార్త తెలుసుకుని కూతురు శ్రావ్యతో కలిసి తణుకు బయలుదేరుతుంది. ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో జ్యోతి మృతి చెందడంతో శ్రావ్య అనాథగా మిగులుతుంది.

ఇదిలా ఉండగా వినయ్ పాత్రలో త్రినాథ్ వర్మ తన అపార్ట్మెంట్ టెర్రస్‌పై ఫోన్ మాట్లాడేందుకు వెళ్లి అనూహ్యంగా కిందపడిపోతాడు. మొదట ప్రమాదమని భావించిన ఈ మరణం వెనుక నిజాన్ని బయటకు తీయడానికి పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ పాత్రలో సుమంత్ రంగంలోకి దిగుతాడు. పోస్ట్‌మార్టం సమయంలో వినయ్ తలలో బుల్లెట్ గుర్తించడంతో కేసు మరింత క్లిష్టమవుతుంది. వినయ్, జ్యోతి మరణాల వెనుక ఎవరు ఉన్నారు? మెర్క్యూరీ పాత్రలో జగపతి బాబు, వినయ్ మధ్య సంబంధం ఏమిటి? వినయ్ చనిపోవడానికి ముందు కార్తీక్ పాత్రలో గౌతమ్ పండిట్‌తో ఎందుకు గొడవ పడాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

నటీనటుల విషయానికి వస్తే, సుమంత్‌కు సూటయ్యే సబ్టిల్ రోల్ వాసుదేవ్ రూపంలో దొరికింది. అతని బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా పాత్ర నడవడం వల్ల సహజంగా అనిపిస్తుంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ త్రినాథ్ వర్మ వినయ్‌గా నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని ఫ్రెండ్‌గా గౌతమ్ పండిట్ కూడా బాగా నటించాడు. తల్లి పాత్రలో షెల్లీ ఎన్ కుమార్ ఆకట్టుకుంది. జగపతి బాబు పాత్ర విలన్ షేడ్ ఉన్నప్పటికీ కెమియోలా అనిపించేంత పరిమితంగా ఉంటుంది. అవసరాల శ్రీనివాస్, రవివర్మ, నేహా పఠాన్ పాత్రలు కూడా సరైన క్యాస్టింగ్‌గా అనిపించాయి.

సాంకేతికంగా చూస్తే, న్యూటన్స్ థర్డ్ లా భావాన్ని దర్శకుడు కర్మ సిద్ధాంతంతో లింక్ చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది. కోర్ ఐడియా బలంగా ఉండటం ప్లస్ పాయింట్. సినిమా ప్రారంభం నుంచే రెండు హత్యలతో కథ వేగంగా ముందుకు సాగి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతుంది. అయితే తరువాత వచ్చే ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్లు రిపీటెడ్‌గా అనిపించి నేరేషన్ ఫ్లాట్‌గా మారుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ కొంత కన్ఫ్యూజన్ కలిగిస్తుంది.

సెకండాఫ్‌లో రాబరీ సీన్, ఫ్రెండ్స్ మధ్య కాన్ఫ్లిక్ట్, డ్రింకింగ్ ఎపిసోడ్ తరువాత వచ్చే ఫైట్ సీన్ బాగానే పనిచేస్తాయి. క్లైమాక్స్‌లో ట్విస్టులు ఉన్నప్పటికీ, విలన్ గ్యాంగ్‌పై హీరో ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ మిగులుతుంది. సిన్జిత్ ఎర్రమిల్లి సంగీతం బాగున్నా, పాటలు కథ ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్‌కు పాటలు అవసరం లేకపోయినా చేర్చడం మైనస్‌గా మారింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే స్థాయిలో ఉంది. వేద వ్యాస్ గొట్టిపాటి సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. నిర్మాణ విలువలు పెద్దగా గ్రాండ్‌గా అనిపించకపోయినా, తక్కువగా కూడా అనిపించవు. ఎడిటింగ్ మరింత కట్టుదిట్టంగా ఉంటే బాగుండేదనే భావన కలుగుతుంది.

మొత్తానికి, మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన ‘Newton’s 3rd Law’ థ్రిల్లర్‌గా ఆసక్తికరమైన పాయింట్లు ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ సాగదీత, పాటలు, క్లైమాక్స్‌లో ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ కారణంగా సినిమా స్థాయి తగ్గింది.

రేటింగ్ 2.5/5.