1990లలో టెలివిజన్ ప్రేక్షకులను ఊపేసిన సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ ‘మర్మదేశం’ తెలుగు చిన్న తెరపై కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఆ సీరియల్ యూనివర్స్ నుండి వచ్చిన తాజా వెబ్ సిరీస్‌ ‘వీరభద్రుని రహస్యం’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘Zee 5’ వేదికగా విడుదలైన ఈ లాంగ్-ఫార్మ్ సిరీస్‌కు భర్గవ్ చాగంటి 3/5 రేటింగ్ ఇచ్చారు. మొత్తం 60 ఎపిసోడ్‌లుగా ప్లాన్ చేసిన ఈ సిరీస్‌లో ప్రస్తుతం మొదటి ఐదు ఎపిసోడ్‌లు మాత్రమే ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి.

ఈ కథ నమ్మకాలు, రహస్యాలకు నిలయమైన ‘వీరభద్రపురం’ అనే మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరి ప్రజలకు తమ గ్రామదైవం వీరభద్రుడంటే అపారమైన భక్తి, అంతే స్థాయిలో భయం. ఊరిలో ఎవరైనా తప్పు చేస్తే దేవుడే స్వయంగా శిక్షిస్తాడనేది వారి నమ్మకం. ఆ ఊరి పురాతన ఆలయంలో ఉన్న పవిత్రమైన ‘ధర్మగంట’ మోగిన ప్రతిసారీ గుడి పరిసరాల్లోనో, శపించబడిన కొండ ‘గద్దల గుట్ట’పైనో ఒక శవం ప్రత్యక్షమవుతుంది. ఈ మరణాలను గ్రామస్తులు దైవ న్యాయంగా భావించి మౌనంగా అంగీకరిస్తారు.

ఈ నేపథ్యంలో నగర వాతావరణం నుండి వచ్చిన హేతువాది, ధైర్యవంతురాలైన యువతి ‘వెన్నెల’ (Annie) తన తండ్రి రామస్వామిని వెతుకుతూ వీరభద్రపురంలోకి వస్తుంది. ఆమె అడుగుపెట్టిన సమయంలోనే ఊరిలో మరో దారుణ హత్య జరుగుతుంది. ఊరి ప్రజలు దానిని కూడా దైవశిక్షగా భావిస్తారు. అయితే వెన్నెల మాత్రం ఈ మూఢనమ్మకాన్ని ఒప్పుకోకుండా, ఈ చావుల వెనుక దాగి ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తుంది.

కథ 1972, 1990ల కాలాల మధ్య రెండు సమాంతర టైమ్‌లైన్లలో నడుస్తుంది. గతంలోకి వెళ్తే యోగానందం (Raghu Kunche) కుమారుడు కార్తికేయ చిన్నతనంలో అడవిలో తప్పిపోవడం, అతనికి వీరభద్రుడు ప్రత్యక్షమై ఒక కత్తిని ఇవ్వడం వంటి ఆసక్తికర సంఘటనలు చూపిస్తారు. ఈ హత్యలకు, పురాతన ధర్మగంటకు ఉన్న సంబంధం ఏమిటి? భక్తి ముసుగులో జరుగుతున్న వ్యవస్థీకృత నేరాలను వెన్నెల ఎలా బహిర్గతం చేస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సిరీస్‌ను పూర్తిగా చూడాల్సిందే.

మొత్తం 60 ఎపిసోడ్‌ల భారీ కథాంశంతో ప్లాన్ చేసిన ఈ సిరీస్‌లో ఇప్పటివరకు కథ ప్రారంభ దశలోనే ఉంది. ఏకంగా అరవై ఎపిసోడ్‌లు ఉండటంతో ఒక్కో నిజం నెమ్మదిగా బయటపడేలా స్క్రీన్‌ప్లే నడుస్తోంది. ప్రస్తుతానికి తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఈ ఆసక్తిని అరవై ఎపిసోడ్‌ల వరకు నిలబెట్టగలరా లేదా అనేది సిరీస్‌ మొత్తం సక్సెస్‌పై ఆధారపడి ఉంటుంది.

ప్రతి ఎపిసోడ్‌లో 1972లో జరిగిన సంఘటనలను కొంత చూపించి, తర్వాత 1992లో జరిగిన కథను చూపించే విధానం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. సస్పెన్స్, ఫోక్‌లోర్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి, ముఖ్యంగా పాతకాలపు వింటేజ్ థ్రిల్లర్స్ చూడాలనుకునే ప్రేక్షకులకు ‘వీరభద్రుని రహస్యం’ మంచి ఎంపికగా నిలుస్తుంది. ఎలాంటి అశ్లీలత లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులందరితో కలిసి డిజిటల్ స్క్రీన్‌పై చూడదగిన సిరీస్‌గా నిలిచింది.

నటీనటుల విషయానికి వస్తే, వెన్నెల పాత్రలో Annie అద్భుతంగా ఒదిగిపోయింది. నాస్తికురాలిగా, పల్లెటూరి మూఢనమ్మకాలను ప్రశ్నించే యువతిగా ఆమె నటన, హావభావాలు సిరీస్‌కు ప్రధాన బలం. యోగానందం పాత్రలో రఘు కుంచె హుందాగా, కూల్‌గా నటించాడు. కథ ముందుకు సాగే కొద్దీ ఆయన పాత్రలో మరిన్ని వైవిధ్యాలు కనిపించే అవకాశం ఉంది. యోగానందం తల్లి పాత్రలో అనురాధ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. కేవలం కొన్ని సెకన్లపాటు కనిపించినప్పటికీ ఆమె గంభీర లుక్ ప్రేక్షకుల్లో ఒక రకమైన భయాన్ని రేకెత్తిస్తుంది. CI రవి పాత్రలో అభినవ్ , ప్రొఫెసర్ నంద పాత్రలో కమల్ తూము , కార్తికేయగా నటించిన రఘు తమ పాత్రల పరిధిలో చక్కని నటనను కనబరిచారు.

సాంకేతికంగా చూస్తే, దర్శకుడు శ్రీ వర్ధన్ రెడ్డి ‘మర్మదేశం’ మూలాలను దెబ్బతీయకుండా, నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. 1970, 1990ల కాలాలకు చెందిన రెండు వేర్వేరు టైమ్‌లైన్లను ఎలాంటి గందరగోళం లేకుండా సమాంతరంగా నడిపించిన తీరు బాగుంది. 60 ఎపిసోడ్‌ల సుదీర్ఘ కథ కావడంతో స్క్రిప్ట్ నెమ్మదిగా, వింటేజ్ శైలిలో సాగుతుంది.

సుధా శ్రీనివాస్ అందించిన నేపథ్య సంగీతం ఈ థ్రిల్లర్ సిరీస్‌కు ప్రాణం పోసింది. అనవసరమైన హడావుడి శబ్దాలు లేకుండా, సీన్లలోని సస్పెన్స్‌ను ఎలివేట్ చేసేలా క్లాసిక్ టోన్‌లో మ్యూజిక్ ఇచ్చారు. సుభాష్ విజువల్స్ పల్లెటూరి వాతావరణాన్ని, ఆ ఊరిలోని మిస్టరీ మూడ్‌ను చక్కగా తెరపై ఆవిష్కరించాయి. రాగం సత్య నితీష్ ఎడిటింగ్ నీట్ గా ఉండటంతో ఎక్కడా కథనం జంప్ అయిన భావన కలగదు.

మొత్తం మీద, ‘మర్మదేశం Universe’లోకి ప్రేక్షకులను మళ్లీ తీసుకెళ్లే ప్రయత్నంగా ‘వీరభద్రుని రహస్యం’ మొదటి ఐదు ఎపిసోడ్‌లు మంచి కిక్ స్టార్ట్ ఇచ్చాయని చెప్పొచ్చు.

రేటింగ్: 2.5/5 ( రివ్యూవర్ అభిప్రాయం మాత్రమే)