శ్రీశైలేం: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (APUWJ) జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయ్ రాయల్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు.

ప్రోటో కాల్ పేరుతో వివిధ శాఖలకు చెందిన సిబ్బంది, కొందరు దళారులను అరికట్టలేని దేవస్థానం అధికారులు, మీడియాపై మాత్రం అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించడం పునరాలోచనీయమని ఆయన డిమాండ్ చేశారు. దేవస్థానం అధికారులు తమ నిర్ణయాన్ని పునర్విమర్శించి, మీడియాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు.

దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీశైల క్షేత్రంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని విజయ్ రాయల్ పేర్కొన్నారు. అలాంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులపై ఆంక్షలు విధించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ, నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న మీడియాపై దేవస్థానం అధికారులు చిన్నచూపు చూడటం మంచి పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు.

మీడియాపై పక్షపాత ధోరణి ప్రదర్శిస్తే దేవస్థానం అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదని విజయ్ రాయల్ హెచ్చరించారు. దేవస్థానం చైర్మన్, ఈవో వెంటనే స్పందించి మీడియాపై విధించిన షరతులను ఎత్తివేయాలని ఆయన కోరారు.

దేవస్థానం చైర్మన్, ఈవో మీడియాపై ఆంక్షలను కొనసాగిస్తే, తమ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని విజయ్ రాయల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో దేవస్థానం అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.