అయోధ్య విరాళాల వివాదం పై సిట్ దర్యాప్తు

సీసీటీవీ దృశ్యాలు తారుమారు..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరానికి అందిన విరాళాలు, వచ్చిన కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. తాజా దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాక్ష్యాలు లేకుండా ఉండేందుకు ఆలయంలోని సీసీటీవీ కెమెరాలను ట్యాంపర్‌ చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని క్లూస్‌ను సిట్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు.

సిట్‌ (SIT) ప్రకారం.. గత 11 నెలల్లో ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్ల కోసం దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేశారు. ఇంత ఖర్చు చేసినప్పటికీ.. విరాళాల పెట్టెల నుంచి నగదు, ఆభరణాలు చోరీకి గురవడం.. భద్రతా వ్యవస్థపై తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. దర్యాప్తులోభాగంగా.. ఆలయంలోని నిఘా వ్యవస్థలు, రికార్డయిన సీసీటీవీ దృశ్యాలు, భద్రత నిర్వహణ నియమాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ కెమెరాలను తారుమారు చేశారనే క్లూస్‌ను కనుగొన్నారు. దీంతో ఆలయ భద్రతా వ్యవస్థలోని వివిధ స్థాయిలలో ఏమైనా లోపాలు ఉన్నాయా..? వారి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. నిఘా, భద్రతా నిర్వహణకు సంబంధించి కొంతమంది సిబ్బంది సర్వీస్ రికార్డులు.. ఇతర వివరాలను కూడా సేకరిస్తున్నారు. 

విరాళాల లెక్కింపు ప్రక్రియలో బ్యాంకు పాత్రను కూడా సిట్‌ పరిశీలిస్తుంది. ఈ ప్రక్రియలో బ్యాంకు సిబ్బందితో పోలిస్తే.. ట్రస్ట్‌ ఉద్యోగుల సంఖ్య పరిమితంగా ఉన్నట్లు సమాచారం. దీంతో లెక్కింపుల సమయంలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. విచారణ కోసం దాదాపు 200 మందితో సిట్‌ జాబితాను సిద్ధం చేయగా.. ఇందులో ఇప్పటికే 125 మందికి పైగా వ్యక్తులను విచారించింది. ఇక, కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్‌శంకర్‌ అలియాస్‌ తినూ యాదవ్‌ అనే వ్యక్తిని పలు గంటల పాటు సిట్‌ అధికారులు ప్రశ్నించారు.