పాట్నా : బిహార్‌లోని ముజఫర్‌ఫూర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం విషాదానికి దారితీసింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

పోలీసులు, అగ్నిమాపక శాఖ అందించిన వివరాల ప్రకారం, ముజఫర్‌ఫూర్‌లోని ఆ ఆస్పత్రి ఐసీయూలో గురువారం ఉదయం సుమారు 3.55 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో సుమారు 20 మంది వరకు రోగులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మంటలు వ్యాపించడంతో వారు అందరూ అక్కడే చిక్కుకుపోయారు.

సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. లోపల చిక్కుకుపోయిన రోగులను బయటకు తరలించే రక్షణ చర్యలు చేపట్టారు.

రక్షణ చర్యల సమయంలో బయటకు తీసుకువచ్చిన వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని సమీపంలోని మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిలో ఇరువురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

అగ్నిమాపక శాఖ అధికారి రామ్ నివాస్ పాండే ఈ ఘటనపై వివరాలు వెల్లడించారు. అయన మాట్లాడుతూ.. ఐసీయూ నుంచి 15 - 20 మందిని కాపాడాం. వారిలో ఇద్దరు అక్కడే చనిపోయారు. మిగిలిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించాము. వారి ఆరోగ్య పరిస్థితి గురించి మాకు అప్‌డేట్ లేదన్నారు.

సంఘటనా స్థలాన్ని సందర్శించిన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్..

డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 13 మంది ఉన్నారు. సీసీయూలో మరి కొంతమంది ఉన్నారు. ఇప్పటి వరకు నలుగురు చనిపోయారు. దర్యాప్తు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం మాత్రమే వెల్లడికానున్నాయని అయన తెలిపారు.

ఐసీయూ వంటి అత్యంత కీలక విభాగంలో ఇలాంటి అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో అగ్ని భద్రతా ప్రమాణాల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం, ఆస్పత్రి యాజమాన్యం నుంచి ఎలాంటి సహాయం అందించాలనే అంశంపై కూడా చర్చ నడుస్తోంది.