రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: న్యూఢిల్లీ, జూన్ 6: భార్య, పిల్లల పోషణ బాధ్యత భర్తదేనని, నిరుద్యోగినన్న కారణం చూపుతూ ఆ కర్తవ్యానికి దూరంగా ఉండలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పని చేసే శక్తి, సామర్థ్యం ఉన్నంత వరకూ భర్త తన కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేడని కోర్టు తేల్చింది.
ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, ఆమె మైనర్ కుమారుడి పోషణ కోసం ప్రతి నెలా రూ.6,000 చొప్పున చెల్లించాలని తండ్రికి ఆదేశించింది. కుమారుడు మేజర్ అయ్యే వరకు ఈ మొత్తం చెల్లింపులు కొనసాగించాలని స్పష్టంచేసింది. నిరుద్యోగినన్న పేరుతో పోషణ భృతి చెల్లించలేనని తండ్రి వాదనను కోర్టు తిరస్కరించింది.
కేసు వివరాల ప్రకారం, అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు వేధింపులకు గురిచేశారంటూ ఆ మహిళ 2013లో గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. అనంతరం 2015 నుంచి ఆమె తన మైనర్ కుమారుడితో కలిసి భర్తకు వేరుగా నివసిస్తోంది. గృహ హింస ఆరోపణలపై విచారణ సందర్భంగా శారీరక వేధింపులకు సంబంధించిన పక్కా ఆధారాలు, రికార్డులు సమర్పించలేకపోవడంతో ఆ అంశంలో ఆమెకు ఉపశమనం లభించలేదు.
శారీరక వేధింపుల ఆరోపణలను కోర్టు కొట్టివేసినా, కుమారుడు తల్లితోనే ఉంటూ ఆమె వద్దే పెరుగుతున్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంది. బాలుడి దినసరి ఖర్చులు, విద్య, ఇతర అవసరాల దృష్ట్యా తండ్రి నుంచి పోషణ భృతి అవసరమని కోర్టు అభిప్రాయపడింది. తండ్రి నిరుద్యోగి అని చెప్పుకోవడం ద్వారా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేడని స్పష్టం చేసింది.
పని చేయగల శారీరక, మానసిక సామర్థ్యం ఉన్న వ్యక్తి, కేవలం ఉద్యోగం లేకపోవడాన్ని సాకుగా చూపి భార్య, పిల్లల పోషణకు దూరంగా ఉండటం సమంజసం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. కుటుంబ పోషణ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి నిరుద్యోగం సరైన కారణం కాదని ఈ తీర్పు ద్వారా హైకోర్టు మరోసారి తెలియజేసినట్టైంది.
ఈ ఆదేశంతో, ఆ బాలుడి పోషణ కోసం తండ్రి ప్రతి నెలా రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది. కుమారుడు మేజర్ అయ్యే వరకు ఈ బాధ్యత కొనసాగుతుందని కోర్టు స్పష్టంచేయడం గమనార్హం. భార్య, పిల్లల పోషణ విషయంలో భర్తల బాధ్యతపై ఈ తీర్పు మరోసారి దృష్టిని ఆకర్షించింది.







