డీకే శివకుమార్‌కు తల నొప్పులు

శాఖల కేటాయింపుపై మంత్రుల అసంతృప్తి

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మంత్రివర్గంలో అసంతృప్తి తలనొప్పిగా మారింది. శాఖల కేటాయింపు విషయంలో సీనియర్ నాయకులు, ఇప్పటికే మంత్రి పదవులు పొందిన కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కూడా ఆలోచనలో పడేశాయి.

ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన రామలింగారెడ్డి, రెండు రోజులకే మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆకస్మిక రాజీనామా కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రామలింగారెడ్డి రాజీనామా తర్వాత గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్ ఫోర్ట్‌ఫోలియో చుట్టూ సందిగ్ధత నెలకొంది.

పార్టీ అధిష్ఠానం గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్ ఫోర్ట్‌ఫోలియోను కృష్ణ బైరి గౌడకు కేటాయించింది. అయితే ఆయన ఇప్పటివరకు ఆ శాఖ బాధ్యతలు స్వీకరించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రామలింగారెడ్డి ఫోర్ట్‌ఫోలియో విషయంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా కృష్ణ బైరి గౌడ ఇంకా శాఖ బాధ్యతలు చేపట్టకుండా వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.

రామలింగారెడ్డికి గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్ ఫోర్ట్‌ఫోలియో ఇస్తామని అధిష్ఠానం ముందుగా మాట ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ శాఖను చివరికి కృష్ణ బైరి గౌడ కు కేటాయించి, రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖను ఇచ్చారు. ఈ మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రామలింగారెడ్డి జూన్ 5న మంత్రి పదవికి రాజీనామా చేశారు.

రామలింగారెడ్డి రాజీనామా తర్వాత గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్ ఫోర్ట్‌ఫోలియో భవిష్యత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ శాఖను తిరిగి రామలింగారెడ్డికే కేటాయించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఫోర్ట్‌ఫోలియో అంశంపై స్పష్టత కోసం కృష్ణ బైరి గౌడ ఢిల్లీకి వెళ్లారు.

కృష్ణ బైరి గౌడ తో పాటు ఎమ్మెల్యే రిజవాన్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఆశిస్తూ రిజవాన్ ఢిల్లీ బాట పట్టినట్లు సమాచారం. ప్రస్తుతం క్యాబినెట్‌లో 21 ఖాళీలు ఉండటంతో, మంత్రి పదవుల కోసం ఆశావహులు అధిష్ఠానాన్ని సంప్రదించేందుకు ఢిల్లీకి తరలిపోతున్నారు.

ఇప్పటికే మంత్రి పదవులు పొందిన కొందరు నాయకులు తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతల అసంతృప్తి, ఫోర్ట్‌ఫోలియో మార్పుల డిమాండ్ల కారణంగా ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఒత్తిడి పెరుగుతోంది. శాఖల కేటాయింపులో సమతుల్యత సాధించడం, అసంతృప్తిని తగ్గించడం డీకే శివకుమార్‌కు పెద్ద సవాలుగా మారింది.