రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. జూన్ 21న నిర్వహించిన NEET రీ ఎగ్జామ్ సందర్భంగా భద్రతా కారణాల వల్ల టెలిగ్రామ్ యాక్సెస్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయం మేరకు జూన్ 22 వరకు ఈ సేవలు నిలిపివేయగా, పరీక్ష ముగిసిన నేపథ్యంలో మళ్లీ వినియోగానికి అందుబాటులోకి తెచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా టెలిగ్రామ్‌పై ఈ పరిమితులు విధించినట్లు అధికారిక సమాచారం తెలిపింది. ఈ క్రమంలోనే టెలిగ్రామ్‌లోని ఎడిట్ ఆప్షన్‌ను కూడా తాత్కాలికంగా తొలగించారు. ఈ నెల 30 వరకు ఎడిట్ ఆప్షన్ తొలగింపు కొనసాగనుందని స్పష్టం చేశారు.
జూన్ 21న నిర్వహించిన NEET ఎగ్జామ్ మొత్తం మీద ప్రశాంతంగా ముగిసిందని అధికారులు పేర్కొన్నారు. National Testing Agency (NTA) విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా పునఃపరీక్షకు 20 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో NEET పరీక్షకు దాదాపు 3.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకోవడంతో వారికి పరీక్ష రాయడానికి అనుమతి లభించలేదు. సమయానికి రాకపోవడంతో నియమాల ప్రకారం వారిని లోపలికి అనుమతించలేదని కేంద్రాల వద్ద ఉన్న సిబ్బంది వివరించారు.
పరీక్షకు అనుమతించలేదని బాధపడుతూ కొంతమంది విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద విలపించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఇలాంటి చిన్న చిన్న సంఘటనలను మినహాయిస్తే, దేశవ్యాప్తంగా NEET రీ ఎగ్జామ్ ఎటువంటి పెద్ద అంతరాయాలు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు పేర్కొన్నారు.







