డెంగీ జ్వరాన్ని నివారించేందుకు దేశంలో తొలి వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) జపాన్‌కు చెందిన టకేడా బయోఫార్మాస్యూటికల్స్ తయారుచేసిన QDENGA వ్యాక్సిన్‌కు అనుమతి మంజూరు చేసింది. దీంతో డెంగీ నియంత్రణలో భారత్‌ కీలక దశలోకి అడుగుపెట్టినట్టైంది.

అధికారిక సమాచారం ప్రకారం, 4 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తులు QDENGA వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. గతంలో డెంగీ సోకిందా లేదా అన్న విషయంపై ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం లేకుండానే ఈ వ్యాక్సిన్‌ను వినియోగించుకునేలా అనుమతి ఇచ్చారు. అంటే డెంగీ వచ్చినవారైనా, రానివారైనా ఈ టీకా తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

డెంగీ వ్యాధికి కారణమయ్యే నాలుగు రకాల వైరస్‌ సీరోటైప్‌ల నుంచి రక్షణ కల్పించేలా QDENGA వ్యాక్సిన్‌ను రూపొందించారు. 0.5 ఎంఎల్‌ మోతాదులో మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఈ టీకాను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే సిఫార్సు చేసింది.

ఆసియా సహా ప్రపంచంలోని అనేక దేశాలు QDENGA వినియోగానికి ముందే అనుమతి ఇచ్చాయి. ఆసియాలోని 43 దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ ఇప్పటికే ఆమోదం పొందింది. ఇప్పుడు భారత్‌ కూడా ఆ జాబితాలో చేరింది. డెంగీ కేసులు అధికంగా నమోదయ్యే దేశాల్లో భారత్‌ ఒకటి కావడంతో ఈ నిర్ణయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రతి సంవత్సరం భారత్‌లో దోమల ద్వారా వ్యాపించే డెంగీ కేసులు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. 2025 సంవత్సరంలోనే సుమారు లక్షకు పైగా కేసులు అధికారికంగా నమోదు కాగా, నమోదు కాని కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే డెంగీ కేసుల్లో మూడో వంతు భారత్‌లోనే ఉన్నట్టు వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి.

క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాల ప్రకారం, రెండు డోసులు పూర్తిచేసుకున్న తర్వాత డెంగీ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని QDENGA వ్యాక్సిన్‌ సుమారు 84.1 శాతం వరకు తగ్గించినట్టు తేలింది. తీవ్ర స్థాయి డెంగీ కేసులను తగ్గించడంలో ఈ టీకా ప్రభావం గణనీయంగా కనిపించిందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

డెంగీ వ్యాప్తి సీజన్‌ ముందుగానే టీకా కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తే, కేసుల తీవ్రతను, ఆసుపత్రి భర్తీలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని ఆరోగ్య రంగ నిపుణులు భావిస్తున్నారు. దేశంలో డెంగీ నియంత్రణ వ్యూహంలో QDENGA వ్యాక్సిన్‌ కీలక పాత్ర పోషించే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.