ఇంధన సరఫరాపై ఆందోళన అవసరం లేదు:

భారత్‌కు 76–80 రోజుల చమురు నిల్వలు – హర్దీప్ సింగ్ పురి

ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి, పశ్చిమ ఆసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలో ఇంధన లభ్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ హర్దీప్ సింగ్ పురి హామీ ఇచ్చారు. భారత్‌లో చమురు, వాయువు నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఆయన వివరాలు వెల్లడించారు. యూనియన్ మినిస్టర్

హర్దీప్ సింగ్ పురి తెలిపిన వివరాల ప్రకారం, భారత్ వద్ద ప్రస్తుతం మొత్తం చమురు, వాయువు నిల్వలు 76 నుంచి 80 రోజుల వరకు దేశ అవసరాలను తీరుస్తాయన్న స్థాయిలో ఉన్నాయి. ఈ నిల్వల్లో భూగర్భ స్ట్రాటజిక్ పెట్రోలియం రెసెర్వెస్ , రిఫైనరీల వద్ద ఉన్న నిల్వలు, వివిధ పోర్టుల వద్ద ఉన్న వాణిజ్య నిల్వలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో ధరల మార్పులు, సరఫరా గొలుసులో అంతరాయాలు ఉన్నప్పటికీ, దేశంలో ఎక్కడా పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. సరఫరా లోపం, నిల్వల కొరత వంటి సమస్యలు ఎక్కడా నమోదుకాలేదని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.

భారత్ ఇంధన కొనుగోలు విధానంలో గణనీయమైన మార్పులు చేస్తూ, ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా విభిన్న దేశాల నుంచి చమురు, వాయువు దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం 41 దేశాల నుంచి చమురు, వాయువు కొనుగోలు చేస్తూ, సరఫరా వనరులను విస్తరించినట్లు హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. దీంతో ఏ ఒక్క ప్రాంతంలో సమస్యలు తలెత్తినా, దేశీయ వినియోగదారులపై దాని ప్రభావం తగ్గేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన సూచించారు.

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే, ముఖ్యంగా స్ట్రైట్ అఫ్ హోర్ముజ్ వంటి ప్రధాన రవాణా మార్గాల్లో తీవ్ర అంతరాయాలు వచ్చినా, తక్షణ కాలంలో భారత్‌కు పెద్ద ప్రమాదం ఉండదని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుత నిల్వలు, విభిన్న దేశాల నుంచి కొనుగోలు చేస్తున్న సరఫరా ఒప్పందాలు, దేశీయ రిఫైనరీల సామర్థ్యం కలిపి, సమీప భవిష్యత్తులో ఇంధన సరఫరాపై ఒత్తిడి తగ్గించేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. స్ట్రాటజిక్ పెట్రోలియం రెసెర్వెస్ విస్తరణ, కొత్త నిల్వ సౌకర్యాల ఏర్పాటు, రిఫైనరీల వద్ద నిల్వ సామర్థ్యాల పెంపు, సరఫరా మార్గాల విభిన్నీకరణ వంటి అంశాలపై దృష్టి సారించినట్లు అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారినా, దేశీయ వినియోగదారులకు ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగేలా చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రం స్పష్టం చేస్తోంది.